
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ముందు చెప్పినట్లుగానే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే పనిని మొదలుపెట్టారు. ఓ వైపు ప్రపంచ దేశాలకు అమెరికా నుంచి అందే సాయాన్ని నిలిపివేసిన ట్రంప్ తాజాగా రెండు వేల మంది ‘యూఎస్ ఎయిడ్’ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులపై వేటు వేశారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొద్ది మందిని మినహాయించి మిగిలిన వారికి బలవంతపు సెలవులు ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాత యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు విషయంలో ట్రంప్ యంత్రాంగం ముందుకెళ్లింది. తమ తొలగింపు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి కార్ల్ నికోలస్ తిరస్కరించారు. అమెరికా నుంచి ప్రపంచంలోని పలు దేశాలకు యూఎస్ ఎయిడ్ ద్వారా సాయం అందుతూ ఉంటుంది.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఖర్చు తగ్గించేందుకు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే బిలియనీర్ ఇలాన్ మస్క్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ)ని ఏర్పాటు చేశారు.
తాజాగా అమెరికా ఫెడరల్ ఉద్యోగులకు గత వారం ఏం చేశారో చెప్పాలని, లేదంటే రాజీనామా చేయాలని డీవోజీఈ నుంచి వెళ్లిన మెయిళ్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మెయిళ్లకు సోమవారం అర్ధరాత్రిలోగా సమాధానమివ్వాలని ఉద్యోగులకు డెడ్‌లైన్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment