
వాషింగ్టన్ : అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారానికి ముందే డొనాల్డ్ ట్రంప్ (donald trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత్‌లో(india) పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు చైనాలో పర్యటించేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలని తన సలహాదారులతో ట్రంప్ మంతనాలు జరిపినట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
మరికొద్ది నెలల్లో వైట్‌హౌస్‌లో జరిగే దేశాదినేతల సమావేశానికి ట్రంప్.. భారత ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం ట్రంప్ భారత్‌లో పర్యటిస్తారని ట్రంప్ విశ్వసనీయ మీడియా వర్గాలు తెలిపాయి. వైట్ హౌస్ సమావేశంలో దేశాదినేతలు చర్చలు సఫలమైతే.. ట్రంప్ ఏప్రిల్ లేదంటే ఈ ఏడాది ఆగస్ట్ నెల తర్వాత భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.
డొనాల్డ్ ట్రంప్ చివరి సారిగా
డొనాల్డ్ ట్రంప్ చివరి సారిగా అమెరికా అధ్యక్షుని హోదాలో 2020లో భారత్‌లో పర్యటించారు. ఆ ఏడాది ఫిబ్రవరి నెలలో భారత పర్యటనలో భాగంగా ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంక ట్రంప్‌లు తరలివచ్చారు. ట్రంప్ తన పర్యటనలో అహ్మదాబాద్, న్యూఢిల్లీని సందర్శించారు.
భారత్‌లో క్వాడ్ మీటింగ్
ఇండో-పసిఫిక్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు క్వాడ్ దేశాలు ఈ ఏడాది భారత్‌లో సమావేశం కానున్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్న క్వాడ్ సమావేశానికి భారత్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఈ సమావేశానికి సభ్యదేశాధినేతలు నరేంద్ర మోదీ (భారత్), ఆంటోనీ ఆల్బనీస్ (ఆస్ట్రేలియా), ఫుమియో కిషిదా (జపాన్)లు హాజరు కానున్నారు. అధ్యక్షుని హోదాలో క్వాడ్ సమావేశానికి హాజరైతే.. బరాక్ ఒబామా తర్వాత ట్రంప్ రెండుసార్లు భారత్‌ను సందర్శించిన రెండవ అమెరికా అధ్యక్షుడు అవుతారు. ఒబామా 2010, 2015లో భారత్‌లో పర్యటించారు. 2015లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాగా, అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు వాషింగ్టన్ సిటీ క్యాపిటల్ భవనంలోని రొటుండా భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment