వాషింగ్టన్: ఓటమిని అంగీకరించబోనని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడడం ప్రారంభమైనప్పటి నుంచీ, ఎన్నికల్లో, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్.. రెండు రోజుల క్రితం మాత్రం ఒక్కసారి ఓడిపోయినట్లు అంగీకరించారు. తాజాగా సోమవారం మళ్లీ, ‘నేనే గెలిచాను’ అని ట్వీట్ చేశారు. అధికార వర్గాలు ఎన్నికల ఫలితాలను మరోలా చెబుతున్నాయని పేర్కొంటూ ట్విట్టర్ ఈ ట్వీట్‌ను తప్పుబట్టింది.
మెజారిటీకి అవసరమైనవి 270 ఎలక్టోరల్ ఓట్లు కాగా.. ఈ ఎన్నికల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌నకు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయని యూఎస్ ప్రధాన మీడియా పేర్కొంది. ట్రంప్ ఓటమిని ఖాయం చేసిన పెన్సిల్వేనియాతో పాటు నెవాడ, మిషిగన్, జార్జియా, అరిజోనాల్లో ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ కోర్టులో కేసులు వేశారు. విస్కాన్సిన్‌లోనూ రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే, తన ఆరోపణలను రుజువుచేసే ఎలాంటి ఆధారాలను కూడా ట్రంప్ చూపడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment