బఫెలో సిటీలో దుకాణాల ముందు భారీగా పేరుకున్న మంచు గుండా వెళ్లి నిత్యావసరాలు కొనుక్కుంటున్న జనం
బఫెలో: అమెరికాలో మంచు తుఫాను (Bomb Cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, తుఫాన్లు, మంచు ధాటికి మంగళవారం కూడా దేశమంతా అతలాకుతలమైంది. 4,000 పై చిలుకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 60 దాటింది.
ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే కనీసం 30 మంది దాకా చనిపోయారు. ఇక్కడి బఫెలో కౌంటీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎటు చూసినా కనీసం 50 అంగుళాల మేర మంచు పరుచుకుపోయింది. 1880ల తర్వాత ఈ ప్రాంతం ఈ స్థాయిలో హిమపాతాన్ని చూడటం ఇదే తొలిసారి! నిత్యావసరాల కొరత పలుచోట్ల లూటీలకు కూడా దారితీస్తోంది. అయితే గత ఆరు రోజులతో పోలిస్తే మంగళవారం పరిస్థితి కాస్త మెరుగైందని, పలు ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.
న్యూయార్క్ రాష్ట్రంలోని ఎల్మ్‌వుడ్‌లో మంచుమయమైన రహదారి
పొంచి ఉన్న వరద ముప్పు
ఉష్ణోగ్రతలు పెరిగితే ఇప్పటిదాకా పేరుకుపోయిన అపారమైన మంచు ఒక్కసారిగా కరిగి ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ముప్పు చాలా ఎక్కువని పేర్కొంది. దాంతో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని ఇప్పట్నుంచే సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment