Facebook Help Woman To Find Her Father After 58 Years - Sakshi
Sakshi News home page

అద్భుతం చేసిన ఫేస్‌బుక్‌.. ఏకంగా 58 ఏళ్ల తర్వాత

Published Mon, Oct 25 2021 6:13 PM | Last Updated on Tue, Oct 26 2021 10:44 AM

Facebook Help Woman To Find Her Father After 58 Years - Sakshi

లండన్‌: గత కొన్నేళ్లుగా దేశంలో ఇంటర్నెట్‌ వాడకం విపరీతంగా పెరిగింది. సోషల్‌ మీడియా వినియోగం కూడా బాగా ఎక్కువ అయ్యింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది సోషల్‌ మీడియాలోనే విహరిస్తుంటారు. ఫలితంగా కొంత కాలంగా సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న నేరాలు కూడా బాగానే పెరుగుతున్నాయి. అయితే సోషల్‌ మీడియా వల్ల పూర్తిగా నష్టమేనా అంటే.. కాదు. దేని ఉపయోగాలు దానికి ఉంటాయి. మనం ఎలా వాడుతున్నాం అనే దాని మీదనే వాటి లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి.

ఇప్పుడిదంతా ఎందుకంటే సోషల్‌ మీడియా ముఖ్యంగా ఫేస్‌బుక్‌ గతంలో ఎందరో విడిపోయిన వ్యక్తులను కలిపిన వార్తల గురించి చదివే ఉన్నాం. తాజాగా ఈ కోవకు చెందిన మరో వార్త వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌ వల్ల ఓ మహిళ ఏకంగా 58 సంవత్సరాల తర్వాత తన తండ్రిని కలుసుకుంది. ఆమె సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదు. 
(చదవండి: ఎంత క్యూట్‌గా రిలాక్స్‌ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది!)

ఆ వివరాలు.. ఇంగ్లండ్‌, లింకన్‌షైర్‌కు చెందిన జూలీ లెయిడ్‌(59) అనే మహిళ ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడు తండ్రి నుంచి దూరమయ్యింది. అప్పట్లో ఇంత సాంకేతిక లేకపోవడం వల్ల తండ్రిని వెతకడం కష్టం అయ్యింది. కానీ చనిపోయేలోపు తండ్రిని చూడాలని బలంగా నిర్ణయించుకుంది జూలీ. ఆమె ప్రయత్నాలకు మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికి వెనకడుగు వేయలేదు. తెలిసిన అన్ని మార్గాల ద్వారా తండ్రి ఆచూకీ కోసం ప్రయత్నించేది.

ఈ క్రమంలో ఓ రోజు జూలీకి ఓ ఐడియా వచ్చింది. తాను ఒక్కర్తే ఇలా ఒంటరిగా ప్రయత్నించడం కంటే.. సోషల్‌మీడియా సాయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంది. దానిలో భాగంగా ఆమె తండ్రి ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. దయచేసి తన తండ్రిని గుర్తించడంలో సాయం చేయాల్సిందిగా నెటిజనులు కోరింది.
(చదవండి: ఫేస్‌బుక్‌, ట్విటర్‌ రెడీనా.. ట్రంప్‌ వచ్చేస్తున్నాడు)

తండ్రి సమాచారం ఆత్రుతగా ఎదురుచూసింది. సరిగా నాలుగు రోజుల తర్వాత అద్భుతం చోటు చేసుకుంది. ఆమె తండ్రి ఆచూకీ తెలుపుతూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ ప్రత్యక్షం అయ్యింది. అందులో ఉన్న అడ్రస్‌కు వెళ్లి.. తండ్రిని కలుసుకుంది. ఇక జూలీ సంతోషాన్ని వర్ణించడానికి మాటలు లేవు. 

గత నాలుగు రోజులుగా వెస్ట్ యార్క్‌షైర్‌లోని డ్యూస్‌బరీలో తండ్రితో కలిసి తిరుగుతూ ఎంజాయ్‌ చేసింది. ఈ సందర్భంగా జూలీ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా నేను అద్భుతాలను నమ్మను. కానీ ఫేస్‌బుక్‌ నాకు చేసిన మేలు చూస్తే నమ్మక తప్పడం లేదు’’ అన్నది.

చదవండి: 'ఐ కాంట్‌ బ్రీత్‌':ఫేస్‌బుక్‌ కు మరో ముప్పు..జూకర్‌ ఏం చేస్తారో?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement