కొవిడ్-19 వ్యాక్సిన్‌లతో లైంగిక సామర్థ్యం తగ్గిపోతోందనే నివేదికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకపక్క కరోనా నుంచి కోలుకున్న వాళ్ల కేసుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతోందని, మగవాళ్లలో లైంగిక పటుత్వం.. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య తగ్గుతోందన్న కథనాలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌లపై పరిశోధన చేసిన సైంటిస్టులు.. కంగారుపడాల్సిన అవసరం లేదని, అదంతా ఉత్త ప్రచారమేనని స్పష్టం చేశారు.
అమెరికాకు చెందిన మియామి యూనివర్సిటీ ఈ మధ్యే 45 మంది వలంటీర్ల మీద అధ్యయనం నిర్వహించింది. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వీళ్లు ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్నారు. వీళ్ల వీర్యకణాల్ని పరీక్షించిన పరిశోధకులు.. వ్యాక్సిన్‌తో సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడం, వీర్యకణాలు తగ్గడం లాంటి ప్రచారాలను ఉత్తదేనని తేల్చారు. డబ్ల్యూహెచ్‌వో గైడ్‌లైన్స్ ప్రకారం జరిగిన ఈ స్టడీలో.. ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్‌లు తీసుకున్నా వాళ్ల లైంగిక సామర్థ్యంలో ఎలాంటి మార్పులు కలగలేదని మియామీ పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ‘జామా’లో ఈ నివేదిక వివరాల్ని ప్రచురించారు.
వ్యాక్సిన్‌తో మారిందా?
టీకాకు ముందు, తర్వాత లైంగిక సామర్థ్య పరీక్షలో పాల్గొన్న పురుషుల్లో 21 మంది ఫైజర్(బయోఎన్‌టెక్) టీకాను, 24 మంది మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రెండు టీకాలను ఎంఆర్ఎన్ఏ విధానంలో తయారు చేసినవేకాగా, ఆ వ్యక్తుల వీర్యకణాల్లో బేస్‌లైన్ స్పెర్మ్ కాన్‌సెంట్రేషన్, టోటల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్.. 26మిలియన్లు/ఎంఎల్, 36 మిలియన్లు ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. ఇక రెండో డోసు తర్వాత వారిలో వీర్యకణాల సంఖ్య స్వల్పంగా 30 మిలియన్లు/ఎంఎల్, టోటల్ కౌంట్ 44 మిలియన్లకు పెరిగింది. టీకా తీసుకున్న తర్వాత ఎంత పరిమాణంలో వీర్యం ఉత్పత్తి అవుతున్నది, వీర్యకణాలు దూసుకెళ్లుతున్న తీరు ఎలా ఉందో ఈ స్టడీ ద్వారా నిర్ధారించారు. సిమెన్ వాల్యూమ్‌తో పాటు స్పెర్మ్ మొటిలిటీ కూడా గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు చెప్పారు.
ఫ్యాక్ట్ చెక్.. చైనా నివేదిక వల్లే..
కరోనా మొదటి వేవ్ విజృంభణ టైంలో.. చైనా సైంటిస్టులు ఒక ఆసక్తికరమైన నివేదిక రిలీజ్ చేశారు. కోవిడ్ జబ్బు సోకిన వాళ్లకు లైంగిక సామర్థ్యం తగ్గుతోందని, క్రమంగా వంధత్వం వస్తోందని ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. కరోనా నుంచి కోలుకున్న కొందరిలో వృషణాల వాపును గుర్తించామని, మరికొందరిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిందని, ఇంకొందరిలో వీర్యకణాల్లో తెల్లరక్త కణాల సంఖ్య పెరగడం గమనించామని తెలిపారు. ఈ రిపోర్టుపై అన్ని దేశాలు ఉలిక్కిపడ్డాయి. అయితే కేవలం ఆరుగురు పేషెంట్ల మీద జరిగిన అధ్యయనం ఆధారంగా విడుదల చేసిన రిపోర్ట్‌కు శాస్త్రీయతను ఆపాదించడం సరికాదని పలువురు చైనీస్ సైంటిస్టులే ఆ సమయంలో ఆ నివేదికను తోసిపుచ్చారు కూడా. ఇప్పుడు ఆ నివేదికను అటు ఇటుగా మార్చేసిన కొందరు వ్యాక్సినేషన్‌పై ఉత్త ప్రచారాలతో బెదరగొడుతున్నారు. ఇక రష్యాలోనూ ఇలాంటి నివేదిక ఒకటి(ఫేక్) ప్రచారం కాగా.. నిర్ధారణ చేసుకోకుండా ఓ ప్రముఖ బ్రిటిష్ పత్రిక కథనం ప్రచురించడం మరింత గందరగోళానికి దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment