Super Bowl Events 2021, Farmers Protest Advertisement In Super Bowl Event - Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియా స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో యాడ్‌

Published Mon, Feb 8 2021 5:12 PM | Last Updated on Mon, Feb 8 2021 5:54 PM

Farmers Protest Advertisement in Super Bowl Event - Sakshi

కాలిఫోర్నియా: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ కొన్ని నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమం అంతర్జాతీయ స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఇటీవల హలీవుడ్‌ నటులు, ఇతర దేశాల నాయకులు రైతుల ఆందోళనకు మద్దతు తెలపడంతో ప్రపంచ స్థాయిలో రైతు ఉద్యమంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా పది కోట్ల మంది చూస్తున్న ఓ స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో రైతుల ఆందోళనకు సంబంధించి ప్రకటన వచ్చింది. రైతులకు అండగా ఉందామని ఆ ప్రకటన పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. 

అమెరికాలో జాతీయ ఫుట్‌బాల్‌ వార్షిక చాంపియన్‌షిప్‌లో భాగంగా ‘సూప‌ర్ బౌల్‌-2021’ కార్యక్రమం నిర్వహించారు. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో సిటీలో ఫిబ్రవరి 7వ తేదీన ఆ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ జరిగింది. కొన్ని కోట్ల మంది చూసే ఈవెంట్‌లో భారతదేశంలో రైతులు చేస్తున్న ఉద్యమం గురించి ప్రకటన (యాడ్) ప్రసారమైంది. ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది.

30 సెకన్ల పాటు ప్రసారమైన ఈ యాడ్‌ మార్టిన్ లూథ‌ర్ కింగ్ జూనియ‌ర్ మాట‌ల‌తో ప్రారంభమైంది. చ‌రిత్ర‌లో సుదీర్ఘ‌మైన పోరాటంగా రైతుల ఉద్యమమని ఆ యాడ్‌లో పేర్కొన్నారు. ‘రైతులు లేకుంటే తిండి లేదు.. భవిష్యత్‌ ఉండదు.. రైతులకు అండగా నిలబడదాం’ అని సందేశాలు ఆ యాడ్‌లో ఉన్నాయి. 2020 నవంబర్‌ నుంచి ఢిల్లీ సరిహద్దులో రైతుల ఉద్యమం మొదలైందని చెబుతూ ఫొటోలు, వీడియాలతో యాడ్‌ ప్రసారమైంది. ‘మేము రైతులం’ అని మొదలైన ఈ యాడ్‌లో ఆరు నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమంలో జరిగిన పరిణామాలు వివరించారు. మానవ హక్కుల ఉల్లంఘన, మృతులు, ఎంతమంది రైతులు ఉన్నారో వివరిస్తూ ఆ యాడ్‌ కొనసాగింది.

అయితే ఇంత పెద్ద స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో ప్రకటన ఇవ్వాలంటే క‌నీసం రూ.36 కోట్ల నుంచి రూ.44 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. అంత ఖర్చు చేసి ఎవరు ఆ యాడ్ వేయించారోనని ఆసక్తికర చర్చ జరిగింది. వాలీ సిక్ క‌మ్యూనిటీ నిధులు ఈ యాడ్‌కు వెచ్చించారని సమాచారం. ఈ యాడ్‌ ప్రసారంపై భారతదేశంలో వివాదం రేగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే హాలీవుడ్‌ నటీనటులు, ప్రముఖులు రైతుల ఆందోళనలపై స్పందిస్తే భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసి ‘ఇది మా అంతర్గత సమస్య’ అని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు దాదాపు పది కోట్ల మందికి పైగా చూసే ఈ స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో రైతుల ఆందోళన చర్చ రావడం ఆసక్తికరంగా మారింది. దీనిపై మన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement