వాషింగ్టన్: అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. అధ్యక్ష పదవికి పోటీ పడేవారిని ఎన్నుకునేందుకుగాను రెండు ప్రధాన పార్టీల ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికలు కూడా మొదలయ్యాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల ప్రచారంలో డీప్ ఫేక్ ఆడియో, వీడియోల బెడద అభ్యర్థులకు ఎక్కువైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా సృష్టించే ఈ ఫేక్ ఆడియో, వీడియోల ట్రెండ్‌ను తమకు అనుగుణంగా మలుచుకునే నేతలు కూడా లేకపోలేదు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన నిజమైన ఆడియో, వీడియోలను కూడా డీప్ ఫేక్ అని తప్పించుకునే నేతలూ ఉన్నారు. వీరిలో రిపబ్లికన్ పార్టీ ప్రధాని అభ్యర్థి రేసులో ఇప్పటికే దూసుకుపోతున్న దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుంటారు.
అయితే తాజాగా యాంటీ ట్రంప్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి చెందిన లింకన్ ప్రాజెక్ట్ రూపొందించిన ఆసక్తికర ఏఐ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల క్రితం చనిపోయిన ట్రంప్ నాన్న ఫ్రెడ్ ట్రంప్ ఆత్మ తన కొడుకు డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న అవలక్షణాలన్నింటినీ చెబుతూ తిడుతుంటుంది. ఫ్రెడ్ ట్రంప్ తిడుతుండగా డొనాల్డ్ ట్రంప్ జీవితంలోని పలు సందర్భాలకు చెందిన వీడియో క్లిప్పులు ప్లే అవుతుంటాయి.
‘డొన్నీ(డొనాల్డ్ ట్రంప్) నువు చేసిన వ్యాపారాలన్నీ చెత్త. కనీసం క్యాసినో ఆడి కూడా నువు డబ్బులు సంపాదించలేకపోయావ్. ఎన్నోసార్లు దివాళా తీసిన నిన్ను నేనే బయటపడేశాను. నువ్వు నా పేరు పెట్టుకున్నందుకు నేను సిగ్గు పడుతున్నాను. నువ్వొక బోరింగ్ మనిషివి. ఆడవాళ్లు నిన్ను ఎందుకు వదిలేస్తారో అందరికీ తెలుసు. పోర్న్ స్టార్‌లకు డబ్బులిస్తావు. నీ పిల్లలు కూడా నిన్ను అసహ్యించుకుంటారు.
నేను సృష్టించిన ట్రంప్ బ్రాండ్ నీ వల్ల చెత్తగా మిగిలిపోయింది. అసలు నా కొడుకు ఇంత దారుణంగా ఎలా తయారయ్యాడు. నువ్వు ఇప్పటివరకు జైలుకు వెళ్లకుండా బయట ఉన్నావంటే అది నీ అదృష్టమే. నేను చనిపోయి 30 ఏళ్లయింది. ఇప్పటికీ నిన్ను చూసి సిగ్గు పడుతున్నాను’ అని ఫ్రెడ్ ట్రంప్ ఆత్మ కొడుకు ట్రంప్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఈ వీడియో ఏఐ ద్వారా సృష్టించిందని లింకన్ ప్రాజెక్ట్ బహిరంగంగానే ఒప్పుకుంది. ఈ వీడియో సరికాదని ట్రంప్ ఇప్పటికే ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment