
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివార్లలోని ఒక ఆహారోత్పత్తుల కార్మాగారంలో గురువారం జరిగిన అగ్రిప్రమాదంలో కనీసం 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. రూప్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, క్షణాల్లో ఫ్యాక్టరీ అంతటా వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ కార్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధికులు టీనేజర్లేనని స్థానికులు తెలిపారు. ‘52 మృతదేహాలను వెలికితీశాం. ఫ్యాక్టరీలో మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశముంది. సహాయ, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని అధికారులు తెలిపారు.
ఆరు అంతస్తులున్న ఆ భవనంలో శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా మంటలు, దట్టంగా పొగ కనిపించాయని స్థానికులు తెలిపారు. ‘మంటలు మొదట ప్రారంభమైన నాలుగో అంతస్తు వరకు గాలింపు ముగిసింది. ఇంకా ఐదు, ఆరు అంతస్తులను పరిశీలించాల్సి ఉంది’ అని అగ్నిమాపక విభాగం అధికారి శుక్రవారం వెల్లడించారు. భవనం పై నుంచి బయటకు వెళ్లే ఎగ్జిట్ పాయింట్‌కు తాళం వేసి ఉందని, దాంతో మంటల్లో చిక్కుకున్న కార్మికులు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment