స్పెయిన్‌లో వర్ష బీభత్సం | flash floods in Spain several deceased updates | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌లో వర్ష బీభత్సం

Published Wed, Oct 30 2024 3:30 PM | Last Updated on Thu, Oct 31 2024 5:23 AM

flash floods in Spain several deceased updates

95 మందికి పైగా మృతి, భారీగా పెరిగే ఆస్కారం

కొట్టుకుపోయిన కార్లు, నదులైన రోడ్లు

బార్సెలోనా: కుండపోత వర్షాలు, వడగళ్ల వానలతో స్పెయిన్‌ అతలాకుతలమవుతోంది. ఆకస్మిక వరదలు మంగళవారం దేశ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. కనీసం 95 మందికి పైగా బలైనట్టు సమాచారం. ఒక్క వాలెన్సియా ప్రాంతంలోనే బుధవారం ఒక్క రోజే మృతుల సంఖ్య 62కు చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే పలువురి మృతదేహాలు దొరికినట్టు తెలిపారు. ఎంతోమంది గల్లంతైనట్టు చెప్పారు. 

పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అక్కడ మరెంతో మంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల భారీగా పెరిగేలా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 320 మి.మీ. వర్షం పడింది! దాంతో మలగా నుంచి వాలెన్సియా దాకా ఎక్కడ చూసినా నదులుగా మారిన రోడ్లు, కూలిన గోడలు, కొట్టుకుపోతున్న కార్లతో ఎక్కడ చూసినా పరిస్థితి భీతావహంగా కనిపిస్తోంది. అపార్ట్‌మెంట్ల గ్రౌండ్‌ ఫ్లోర్లన్నీ నీట మునిగిపోయాయి.

 ఇళ్లలోని సామాన్లన్నీ వరద పాలై కొట్టుకుపోతున్నాయి. స్పెయిన్‌ ఇంతటి వరదల బారిన పడటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. వరదలో చిక్కిన వారిని హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా కాపాడుతున్నారు. ప్రభావి త ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసర సైనిక బృందం నుంచి వెయ్యి మంది సిబ్బందిని నియోగించారు. ఎడతెరిపి లేని వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గురువారం తీవ్ర వర్షసూచనలున్నాయి.

రవాణా కుదేలు
ఆకస్మిక వరదల దెబ్బకు ఏకంగా పలు నదులపై బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. దాంతో స్పెయిన్‌ అంతటా రవాణా వ్యవస్థ కుదేలైంది. రైలు, విమాన సేవలు ప్రభావితమయ్యాయి. మలగా సమీపంలో 300 మంది పై చిలుకు ప్రయాణికులతో వెళ్తున్న హైస్పీడ్‌ ట్రెయిన్‌ పట్టాలు తప్పింది. దాంతో వాలెన్సియా అంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. స్కూళ్లు, పార్కులను మూసేస్తున్నట్లు, క్రీడా కార్యక్రమాలను నిలిపేస్తున్నట్లు వాలెన్సియా సిటీ హాల్‌ తెలిపింది. అండలూసియాలో కొన్ని ప్రాంతాల్లో రెండో అతి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వరదల్లో చాలా మంది గల్లంతయ్యారని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ అన్నారు. బాధితులను ఉద్దేశించి ఆయన టీవీలో మాట్లాడారు.

నిన్నటిదాకా కరువు...
స్పెయిన్‌ కొన్నేళ్లుగా తీవ్ర కరువు పరిస్థితుల బారిన పడింది. తాజాగా గత సీజన్‌లో కొనసాగిన కరువు దెబ్బ నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే ఇలా వరదలు వచ్చి పడ్డాయి. వెచ్చని మధ్యధరా జలాలపై చల్లని గాలి కారణంగా ‘కోల్డ్‌ డ్రాప్‌’తో ఏర్పడ్డ క్యుములోనింబస్‌ మేఘాలు ఈ ఆకస్మిక వర్షాలకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి విపరీత సంఘటనలు తరచుగా, తీవ్రస్థాయిలో జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

క్రెడిట్స్‌: News is Dead 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement