జార్జియా: సాధారణంగా మేకలకు ఆకలేస్తే చెట్లు, మొక్కల ఆకులు తింటాయి. కానీ ఈ మేక ఏంటో అమెరికాలోని జార్జియాలో ఓ పోలీసు అధికారిణి కారులోకి దూరి ఆమెకు సంబంధించిన ఆఫీసు పేపర్లను తిన్నది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను డగ్లస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫేస్‌బుక్‌లో ఫోస్ట్ చేసింది. ‘మేం నవ్వుకున్నాం. మీరు కూడా నవ్వుకుంటారని ఆశిస్తున్నాం’ అని కాప్షన్ జత చేసింది. డిప్యూటీ పోలీసు అధికారిణి జార్జియాలోని ఓ ఇంటికి వెళ్లి సివిల్ పేపర్లను ఇచ్చి కారు వద్దకు వచ్చేసరికి ఒక మేక తన కారులోకి దూరి ఆఫీసు పేపర్లను తింటూ కనిపిస్తుంది. దీంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోతారు.
ఆమె ఆఫీసు పనుల మీద పలు నివాసాలకు వెళ్లినప్పుడు కారు డోర్ వేయకుండానే వెళ్తారు. దీంతో కొన్ని సార్లు ఆమె కారులోకి వీధి కుక్కలు దూరడానికి ప్రయత్నించేవి. కానీ ఈసారి ఒక మేక తన కారులోకి దూరింది. ఈ వీడియోలో ఆమె మేకను కారు నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నించడం, అది కాగితాలను నములుతూ ఎంతకూ వెళ్లకపోవడం చూడవచ్చు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రెండు రోజుల్లో మూడు లక్షల మంది వీక్షించగా, నాలుగు వేల లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘పోలీసు అధికారిణి తిరిగి రాకముందే నా అరెస్ట్ వారెంట్‌ను తినాలి’ అని ఆ మేక అనుకుంటుదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment