గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు నడుస్తోంది. పండగవేళ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన హమాస్ దళాలు 199 మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకున్నారు. అకస్మాత్తుగా హమాస్ దళాలు జరిపిన తీరుకు విస్తుపోయిన ఇజ్రాయెల్.. తేరుకుని ధీటుగా బదులిచ్చింది. హమాస్‌ను తుదముట్టించేంతవరకు విశ్రమించబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే దాడుల్లో గాయపడి తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెలీ యువతికి సంబంధించిన ఓ వీడియోను హమాస్ విడుదల చేసింది. భుజం గాయంతో బాధపడుతున్న ఆ యువతి శస్త్రచికిత్స తీసుకుంటున్న వీడియోను హమాస్ టెలిగ్రామ్‌లో బహిర్గతం చేసింది.
బందీగా ఉన్న షోహమ్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల మియా షెమ్ వీడియోలో మాట్లాడుతోంది. ఆమె హమాస్ సంరక్షణలోనే ఉన్నట్లు హామీ ఇచ్చింది. దాడుల్లో విరిగిన చేతికి గాజాలో శస్త్రచికిత్స చేయించుకున్నానని వెల్లడించిన మియా.. వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
'హాయ్, నేను మియా షేమ్. నాకు 21 ఏళ్ల వయస్సు. ప్రస్తుతం నేను గాజాలో ఉన్నాను. దాడి జరిగే క్రమంలో నేను పార్టీలో ఉన్నాను. నా చేతికి తీవ్ర గాయమైంది. గాజాలోని ఓ ఆసుపత్రిలో నా చేతికి 3 గంటలపాటు శస్త్రచికిత్స జరిగింది. ఇక్కడ నుంచి వీలైనంత త్వరగా నన్ను తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను' అని మియా షెమ్ పేర్కొంది.
అక్టోబర్ 7న మ్యూజికల్ ఫెస్టివల్‌లో హమాస్ దళాల దాడులు దిగ్భ్రాంతిని గురిచేశాయి. రాకెట్ దాడులతో విరుచుకుపడిన హమాస్.. ఇజ్రాయెల్‌లో పండవేళ మారణహోమాన్ని సృష్టించింది. 199 మందిని బందీలుగా పట్టుకుని గాజాలో బందించింది. ఇజ్రాయెల్‌లో 75 ఏళ్ల చరిత్రలో ఇంతటి స్థాయిలో ఒకేరోజు మరణాలు సంభవించింది ఇదే ప్రథమం.
ఇదీ చదవండి: మోహరించిన ఇజ్రాయెల్ సేనలు
Comments
Please login to add a commentAdd a comment