ఇజ్రాయెల్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మరో ఇద్దరు బందీలను విడుదల చేసింది. వారిద్దరూ ఇజ్రాయెల్‌కు చెందిన వృద్ధ మహిళలు. ఈజిప్ట్-ఖతార్ మధ్యవర్తిత్వం తర్వాత మానవతా దృష్టితో ఆ ఇద్దరు బందీలను విడుదల చేసినట్లు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అంతకుముందు శుక్రవారం హమాస్ ఇద్దరు అమెరికన్ బందీలను విడుదల చేసింది. వారు తల్లీకూతుళ్లు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి, వందలాది మందిని బందీలుగా పట్టుకుంది. ప్రస్తుతం హమాస్ అదుపులో 222 మంది బందీలుగా ఉన్నారని సమాచారం.
గత కొన్ని రోజులుగా గాజా స్ట్రిప్‌ను సీజ్ చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ యాక్షన్ విరమించడం లేదు. కాగా హమాస్ చెర నుండి బందీలను విడిపించేందుకు, వారితో చర్చలు జరిపేందుకు గ్రౌండ్ యాక్షన్ కొంతకాలం విరమించాలని అమెరికా సూచించింది. ఈ చర్య గాజాకు మానవతా సహాయం అందించే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొంది. అలాగే బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా చూసేందుకు ఇజ్రాయెల్‌తో మాట్లాడుతున్నట్లు అమెరికా తెలిపింది.
హమాస్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయెల్‌ను బలోపేతం చేయడమే అమెరికా ప్రథమ ప్రాధాన్యత అని వైట్‌హౌస్ అధికారి జాన్ కిర్బీ తెలిపారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందేలా చూడటం కూడా దీని లక్ష్యమన్నారు. గాజాను విడిచి వెళ్లాలనుకునే అమెరికన్ పౌరులతో సహా గాజా నుండి అమాయక ప్రజలను సురక్షితంగా తరలించాలనుకుంటున్నామని ఆయన అన్నారు.
హమాస్- ఇరాన్ మధ్య సంబంధాల గురించి జాన్ కిర్బీ మాట్లాడుతూ ఈ దాడుల్లో ఇరాన్ భాగస్వామి అని తమకు తెలుసని, ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా హమాస్‌కు మద్దతు ఇస్తోందని, ఇరాన్ లేకుండా హమాస్‌కు ఉనికి లేదని ఆరోపించారు. కాగా ఖతార్‌తో సహా ఇతర మధ్యవర్తుల సాయంతో బందీలను విడుదల చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఖతార్ ప్రయత్నాల కారణంగా హమాస్ ఇటీవల ఇద్దరు అమెరికన్ బందీలను విడుదల చేసింది. ప్రస్తుతం హమాస్ కస్టడీలో 222 మంది పౌరులు బందీలుగా ఉన్నారు. వీరిలో అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఇరాన్‌లో మహిళా జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు
Comments
Please login to add a commentAdd a comment