లండన్: బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ.. మొట్టమొదటి భారత సంతతి, హిందూ ప్రధాని పీఠం అధిరోహించారు రిషి సునాక్. ఈ సందర్భంగా.. ఆయనపై ప్రపంచ నేతలతో పాటు బ్రిటన్ వాసులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది తమకు ‘ఒబామా మూమెంట్’ అని అక్కడి హిందూ దేవాలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది.
బ్రిటన్ రాజధాని లండన్‌కు 110 కిలోమీటర్ల దూరంలోని సౌతాంప్టన్‌లో వేదిక్ సొసైటీ హిందూ దేవాలయం ఉంది. దీనిని రిషి తాత రామ్‌దాస్ సునాక్ 1971లో నిర్మించారు. ఆ తర్వాత ఆయన తండ్రి యాష్ సునాక్.. 1980 నుంచి ట్రస్టీగా కొనసాగారు. ఇప్పటికీ రిషి కుటుంబం ఆ ఆలయంతో అనుబంధం కొనసాగిస్తోంది. హాంప్‌షైర్ నగర్లోని ఆలయాన్ని రిషి సునాక్.. తరుచుగా సందర్శిస్తుంటారు. ఈ జులైలో కూడా అక్కడకు వెళ్లారు. ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు.
‘ఇది గర్వించదగ్గ క్షణం. రిషి సునాక్ విజయంతో ఈ గుడి ఆవరణలో సందడి నెలకొంది. ఇక్కడున్న సుమారు 300 మంది ఆయనతో దిగిన చిత్రాలను చూపించి, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది బ్రిటన్‌కు బరాక్ ఒబామా మూమెంట్. మొదటిసారి శ్వేత జాతియేతర వ్యక్తి ప్రధాని అయ్యారు. ఆయన ప్రధాని అవబోతున్నారనే వార్త వినగానే వెంటనే ప్రత్యేక పూజలు నిర్వహించాం’ అని ఆలయ కమిటీ నేత సంజయ్ చందరాణా పేర్కొన్నారు. బ్రిటన్‌కు రిషి సునాక్ ప్రధానికావటం అనేది దేశాన్ని ఏకం చేయటమేనన్నారు. బరాక్ ఒబామా 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అగ్రదేశపు అత్యున్నత స్థానంలో కూర్చొన్న తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా ఆయన ఖ్యాతి గడించారు. బరాక్ ఒబామా పాలనా కాలాన్ని సూచిస్తూ రిషి సునాక్‌పై ప్రశంసలు కురిపించారు ఆలయ కమిటీ నేత సంజయ్ చందరాణా.
ఇదీ చదవండి: రిషి సునాక్ ప్రసంగం: ఐదు ప్రధానాంశాలు
Comments
Please login to add a commentAdd a comment