Barak Obama
-
అందుకే కమలా హారిస్‌కు ఒబామా మద్దతు ఇవ్వటం లేదు!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు. జో బైడెన్ స్వయంగా కమలా హారిస్ పేరును అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ.. మద్దతు ప్రకటించారు. దీంతో అధ్యక్ష అభ్యర్థి స్థానంలో ఇండో-అమెరికన్ కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఇక.. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్దతు ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం కమలా హారిస్‌కు మద్దతుగా ప్రకటన లేదు. దీనిపై పార్టీలో సైతం తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే కమలా హారిస్ అభ్యర్థిత్వంపై ఒబామా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ గెలిచే అవకాశాలు లేవని ఒబామా భావిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ‘అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ పడేందుకు కమలా హారిస్ శక్తివంతురాలు కాదని ఒబామా భావిస్తున్నారు. ఇప్పటివరకు దేశ సరిహద్దులకు వెళ్లని కమలా వలసదారులందరికీ ఆరోగ్య బీమా ఉండాలని మాట్లాడుతున్నారు. ..ఇలాంటి సవాళ్లను దాటి ముందుకెళ్లడం ఆమెకు కష్టమైన పని అని అనుకుంటున్నారు. ప్రెసిడెంట్ అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయంపై ఒబామా అసంతృప్తిగా ఉన్నారు. అందుకే హారిస్‌కు మద్దతిచ్చేందుకు ముందుకు రావట్లేదు’ అని ఒబామా కుటుంబ వర్గాలు వెల్లడించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. -
అప్పుడు అమెరికాకు ఒబామా.. ఇప్పుడు బ్రిటన్‌కు సునాక్..!
లండన్: బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ.. మొట్టమొదటి భారత సంతతి, హిందూ ప్రధాని పీఠం అధిరోహించారు రిషి సునాక్. ఈ సందర్భంగా.. ఆయనపై ప్రపంచ నేతలతో పాటు బ్రిటన్ వాసులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది తమకు ‘ఒబామా మూమెంట్’ అని అక్కడి హిందూ దేవాలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. బ్రిటన్ రాజధాని లండన్‌కు 110 కిలోమీటర్ల దూరంలోని సౌతాంప్టన్‌లో వేదిక్ సొసైటీ హిందూ దేవాలయం ఉంది. దీనిని రిషి తాత రామ్‌దాస్ సునాక్ 1971లో నిర్మించారు. ఆ తర్వాత ఆయన తండ్రి యాష్ సునాక్.. 1980 నుంచి ట్రస్టీగా కొనసాగారు. ఇప్పటికీ రిషి కుటుంబం ఆ ఆలయంతో అనుబంధం కొనసాగిస్తోంది. హాంప్‌షైర్ నగర్‌లోని ఆలయాన్ని రిషి సునాక్.. తరుచుగా సందర్శిస్తుంటారు. ఈ జులైలో కూడా అక్కడకు వెళ్లారు. ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ‘ఇది గర్వించదగ్గ క్షణం. రిషి సునాక్ విజయంతో ఈ గుడి ఆవరణలో సందడి నెలకొంది. ఇక్కడున్న సుమారు 300 మంది ఆయనతో దిగిన చిత్రాలను చూపించి, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది బ్రిటన్‌కు బరాక్ ఒబామా మూమెంట్. మొదటిసారి శ్వేత జాతియేతర వ్యక్తి ప్రధాని అయ్యారు. ఆయన ప్రధాని అవబోతున్నారనే వార్త వినగానే వెంటనే ప్రత్యేక పూజలు నిర్వహించాం’ అని ఆలయ కమిటీ నేత సంజయ్ చందరాణా పేర్కొన్నారు. బ్రిటన్‌కు రిషి సునాక్ ప్రధానికావటం అనేది దేశాన్ని ఏకం చేయటమేనన్నారు. బరాక్ ఒబామా 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అగ్రదేశపు అత్యున్నత స్థానంలో కూర్చొన్న తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా ఆయన ఖ్యాతి గడించారు. బరాక్ ఒబామా పాలనా కాలాన్ని సూచిస్తూ రిషి సునాక్‌పై ప్రశంసలు కురిపించారు ఆలయ కమిటీ నేత సంజయ్ చందరాణా. ఇదీ చదవండి: రిషి సునాక్ ప్రసంగం: ఐదు ప్రధానాంశాలు -
Al Zawahiri: అల్‌ఖైదా చీఫ్ హతంపై బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: డ్రోన్ దాడితో అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా ముట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివెేళ్లతో పెకలించివేయవచ్చు అనేందుకు జవహరి ఘటనే నిదర్శనమన్నారు. అతని మృతితో 9/11 దాడుల బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే ఒక్క పౌరుని ప్రాణాలకు కూడా హాని లేకుండా జవహరిని అంతం చేసినందుకు అధ్యక్షుడు జో బైడెన్ పాలనాయంత్రాంగంపై ప్రశంసల వర్షం కురిపించారు ఒబామా. ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేసిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. More than 20 years after 9/11, one of the masterminds of that terrorist attack and Osama bin Laden’s successor as the leader of al-Qaeda – Ayman al-Zawahiri – has finally been brought to justice. — Barack Obama (@BarackObama) August 2, 2022 కాబూల్‌లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓ ఇంట్లో ఉన్న అల్ జవహరి బాల్కనీలోకి వచ్చినప్పుడు డ్రోన్లతో క్షిపణిదాడులు చేసింది అమెరికా. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. అతని మృతితో 9/11 ఘటన బాధితుల కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన నిఘా వర్గాలను కొనియాడారు. 9/11 ఘటన అనంతరం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాల పాటు యుద్ధం చేశాయి అమెరికా బలగాలు. అఫ్గాన్ సైన్యానికి కూడా శిక్షణ ఇచ్చాయి. అయితే గతేడాదే అమెరికా బలగాలను ఉపసంహరించారు జో బైడెన్. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని ఒబామా అన్నారు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
రికార్డు సృష్టిస్తున్న ఒబామా పుస్తకం
న్యూయార్క్ : యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రచించిన ‘‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’’పుస్తకం రికార్డులు సృష్టిస్తోంది. రిలీజైన తొలి 24 గంటల్లో ఈ బుక్ 8.9 లక్షల కాపీలు అమ్ముడైంది. ఆధునిక అమెరికా చరిత్రలో బెస్ట్ సెల్లింగ్ ప్రెసిడెన్షియల్ రచనగా నిలవనుంది. పెంగ్విన్ రాండమ్ హౌస్ విడుదల చేసిన ఈ పుస్తకం అమ్మకాలకు దగ్గరలోకి వచ్చే పుస్తకం ఒబామా భార్య మిషెల్ రచించిన ‘‘బికమింగ్’’ కావడం విశేషం. బుధవారానికి అమెజాన్, బారన్స్ అండ్ నోబుల్ డాట్‌కామ్ సైట్లలో ఒబామా బుక్ నంబర్ 1 స్థానంలో ఉంది. పది రోజుల్లో అమ్మకాలు మరిన్ని రికార్డులు సృష్టించవచ్చని అంచనాలున్నాయి. గతంలో బిల్ క్లింటన్ రచన ‘‘మైలైఫ్’’4 లక్షల కాపీలు, బుష్ రచన ‘‘డెసిషన్ పాయింట్స్’’2.2 లక్షల కాపీల మేర తొలిరోజు అమ్ముడయ్యాయి. ఒబామా పుస్తకం విడుదలైన సమయంలో దేశంలో అనిశ్చితి, సంక్షోభం(ఎన్నికలు, కరోనా తదితరాలు) నెలకొని ఉన్నా పుస్తక ప్రియులు మాత్రం విశేషంగా స్పందించారు. పుస్తకం ఆరంభించిన సమయంలో ఎన్నికల ఫలితాల నాటికి విడుదల చేయాలని తాను అనుకోలేదని ఒబామా చెప్పారు. గతంలో ఒబామా రచించిన ‘‘డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్’’, ‘‘ద ఆడిసిటీ ఆఫ్ హోప్’’ పుస్తకాలు సైతం విశేష ఆదరణ పొందాయి. పలువురు రివ్యూ రచయితలు తాజా పుస్తకాన్ని ప్రశంసించారు. -
రాహుల్ గాంధీకి ఆ పట్టుదల లేదు : ఒబామా
న్యూఢిల్లీ : 'కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలో ఎక్కడో తెలియని భయం ఉంది. తరగతి గదిలో టీచర్‌ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే విద్యార్థిలా రాహుల్ చాలా ఆత్రుతగా ఉంటారు. అయితే ఏదైనా ఓ విషయం గురించి లోతుగా నేర్చుకోవాలనే అభిరుచి, లక్షణం, పట్టుదల లేదు’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఒబామా..తన రాజకీయ అనుభవాలు, జీవిత జ్ఞాపకాలను ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. నవంబరు 17న ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. (వీడియో ట్వీట్ చేసిన ఒబామా) ఇందులో భాగంగా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌లపై కూడా ఒబామా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఏం రాశారు అన్నది ఇంకా తెలియరాలేదు. అలాగే అధ్యక్షుడి హోదాలో రెండుసార్లు 2010, 2015లో భారత్ పర్యటనకు వచ్చిన వ్యక్తిగా ఒబామా చరిత్ర సృష్టించారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 2017లో ఒబామాను కలిశారు. ఒబామా గతంలో ‘డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్’, ‘ది అడాసిటీ ఆఫ్ హోప్’, ‘ఛేంజ్ వి కెన్ బిలీవ్ ఇన్’ పుస్తకాలు రాశారు. Had a fruitful chat with President @BarackObama Great to meet him again. pic.twitter.com/LCJKGBg0Qr — Rahul Gandhi (@RahulGandhi) December 1, 2017 -
ట్రంప్ నిర్ణయాలన్నీ ‘తలకిందులే’నా!?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి దిశగా ప్రయాణిస్తోన్న డొనాల్డ్ ట్రంప్ తన నాలుగేళ్ల కాలంలో ఏమేమి పనులు చేశారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒక్కసారి సమీక్షిస్తే విస్మయం కలుగుతోంది. గత దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ పూర్తిగా తల కిందులు చేశారు. అంతర్జాతీయంగా చేసుకున్న పలు ఒప్పందాల నుంచి వైదొలిగారు. కీలకమైన వాతావరణ మార్పుల ఒప్పందం నుంచి అమెరికాను తప్పించారు. అమెరికాలో పర్యావరణ పరిరక్షణకు నిర్దేశించిన ప్రమాణాలను నీరుగార్చారు. (చదవండి: ట్రంప్‌కు మరో తలనొప్పి : వైట్ హౌస్ చీఫ్‌కు కరోనా) దినదినం ప్రవర్దమానమువుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ‘ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్’ నుంచి అమెరికాను తొలగించారు. క్యూబా, ఇరాన్‌తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేశారు. ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ఒబామా సుదీర్ఘకాలం కృషి చేసి తీసుకొచ్చిన హెల్త్ కేర్ చట్టాన్ని కూడా ట్రంప్ నీరుగార్చారు. ఇరాన్ అణు ఒప్పందంగా పిలిచే ఏడు దేశాల ‘జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్’ నుంచి అమెరికాను తప్పించి ఇరాన్ మీద మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించారు. సిరియా, యెమెన్ అంతర్యుద్ధాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అప్పటికే ఇరాన్ ఆర్థికంగా ఎంతో దెబ్బతిని ఉంది. 2019, జూన్ నెలలో ఇరాన్స్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్ ఓ అమెరికా నిఘా విమానాన్ని కూల్చి వేయగా, అందుకు ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన 130 మిలియన్ డాలర్ల పైలట్ రహిత విమానాన్ని అమెరికా సైన్యం కూల్చి వేసింది. ఇరాన్ రేడార్‌ను, క్షిపణుల బ్యాటరీలను కూడా ధ్వంసం చేయాలని అమెరికా చూసింది. తద్వారా ఇరాన్‌తో పూర్తి స్థాయి యుద్ధం తధ్యమవుతున్న ఉద్దేశంతో ట్రంప్, చివరి నిమిషంలో దాడిని ఉపసంహరించుకున్నారు. ఆ దాడి వల్ల 150 మంది ఇరాన్ ప్రజలు మరణిస్తారని తెలుసుకొని ఆ దాడిని ఉపసంహరించుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్ దేశాల్లో ఇరాన్ సైనిక బలగాలు తిష్టవేయడానికి బాధ్యుడైన ఇరాన్ ప్రముఖ నాయకుడు జనరల్ ఖాసిం సొలైమనిని 2020, జనవరి నెలలో ట్రంప్ చంపించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్ సైనికులు ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా రాకెట్ దాడులకు పాల్పడింది. అందులో భాగంగా టెహరాన్ నుంచి బయల్దేరిన ఉక్రెనియన్ ఏర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని ఇరాన్ సైనికులే పొరపాటున కూల్చి వేశారు. ఇరాన్ ప్రయాణికులు ఎక్కువగా ఉన్న ఆ విమానంలో ప్రయాణిస్తోన్న మొత్తం 176 మంది మరణించారు. మరోపక్క జనరల్ సులైమన్ అంత్యక్రియల్లో తొక్కిసలాట జరగడంతో 56 మంది మరణించారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. వారంతట వారే శిక్ష విధించుకున్నారని సంతృప్తి పడిన ట్రంప్, ఇరాన్‌పై తదుపరి దాడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేకుండా సిరియాకు రసాయనిక ఆయుధాలు అందకుండా చేయడం కోసం రష్యా నేత వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ ఒప్పందం చేసుకున్నారు. సిరియా, అఫ్ఘానిస్తాన్ దేశాల నుంచి అమెరికా సైనిక బలగాలు ట్రంప్ ఉపసంహరించారు. ‘ప్రపంచ పోలీసు అమెరికా’ అనే ముద్ర నుంచి అమెరికాను తప్పించేందుకు ట్రంప్ కృషి చేశారు. అమెరికా మాజీ అధ్యక్షులకు ముప్పు రాకుండా ఉండేందుకే ఆయన అంతర్జాతీయంగా అమెరికా పాత్ర కుదిస్తూ రావడం కొంత మేరకు ట్రంప్‌కు ప్రశంసలు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. అయితే ట్రంప్ మెతక వైఖరిని అలుసుగా తీసుకొన్న చైనా మరోవైపు అమెరికాకు ప్రత్యామ్నాయంగా బలపడుతూ వస్తోంది. -
‘ఒబామాకు కాదు నాకు ఇవ్వాలి నోబెల్’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శాంతి స్థాపన కోసం తాను ఎంతో కృషి చేశానని.. కానీ నోబెల్ కమిటీ తన కృషిని గుర్తించలేదని ఆరోపించారు. 2009లో ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అధ్యక్షుడు అయిన వెంటనే ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. అసలు ఆ అవార్డు ఎందుకు ఇచ్చారో ఒబామాకు కూడా తెలియదు’ అంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2009లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఒబామాకు... అంతర్జాతీయ స్థాయిలో చూపించిన దౌత్యం, వివిధ దేశాల మధ్య నెలకొల్పిన సహకారం, ప్రజలతో కలిసి పనిచేసే మనస్తత్వం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. అప్పట్లో ఒబామాకు ఈ బహుమతి ఇవ్వడం పట్ల విమర్శలు కూడా తలెత్తాయి. దాదాపు పదేళ్ల తర్వాత తాజాగా ట్రంప్ మరోసారి ఆ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లిన ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వకపోవడం సరికాదన్నారు. చాలా అంశాల్లో తాను చేసిన కృషికిగాను నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వివక్ష లేకుండా ఇచ్చివుంటే... తనకు ఎప్పుడో నోబెల్ వచ్చేదన్నారు. 2009లో ఒబామాకు ఇచ్చినప్పుడు... తనకెందుకు ఇవ్వరన్నది ట్రంప్ అభ్యంతరం. -
ఒబామాకు నటి ప్రత్యేక కానుక
భారత దేశ పర్యటనలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నటి పూనమ్ కౌర్ ప్రత్యేక కానుక ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి వెళ్లిన పూనమ్, ఒబామాను కలిశారు. ఈ సందర్భంగా పూనమ్ చేనేత వస్త్రాలను ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను పూనమ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని.. తాను ఆదర్శంగా భావించే వ్యక్తి బరాక్ ఒబామా అని తెలిపింది. ఆయనకు చేనేత వస్త్రాలు కానుకగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కాగా పూనమ్ కౌర్‌ను ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రచార కర్తగా నియమించినట్టు ఇటీంల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నారు
వాషింగ్టన్: ఉన్నత చదువుల కోసం పెద్ద కుమార్తె మాలియా(19)ను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేర్చినప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనై, కన్నీళ్లు పెట్టుకున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. మాలియాను వర్సిటీలో వదిలి వస్తుంటే తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతున్నంత బాధ కలిగిందన్నారు. డెలావర్‌లోని బ్యూ బిడెన్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ విందు కార్యక్రమంలో ఒబామా మాట్లాడారు. మాలియాను హార్వర్డ్‌లో వదిలి వస్తున్న సమయంలో తనకు విపరీతంగా ఏడుపు వచ్చినప్పటికీ ఆమె ముందు ఏడ్వలేదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జో బిడెన్(మాజీ ఉపాధ్యక్షుడు) దంపతుల్ని ఉద్దేశించి ఒబామా అన్నారు. ఇందుకు తాను గర్వపడుతున్నట్లు సరదాగా వ్యాఖ్యానించారు. తిరుగుప్రయాణంలో ముక్కు తుడుచుకుంటూ తాను చేసిన శబ్దాలు సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి వినిపించినప్పటికీ వారు విననట్లే నటించారని చమత్కరించారు. జీవితంలో మనం ఎంత సాధించినా, చివరికి మనకు సంతోషాన్నిచ్చేది మాత్రం పిల్లలేనన్నారు. మళ్లీ అదే స్థాయి ఆనందం మనవళ్లు, మనవరాళ్ల వల్లే దక్కుతుందని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో మాలియా ఐవీ లీగ్ స్కూల్లో చేరారు. -
25 నుంచి భారత్‌లో ఒబామా పర్యటన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెల 25 నుంచి 27 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్యఅతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగే సీఈఓల సమావేశంలో ఓబామా పాల్గొంటారు. ఈ పర్యటనలో ఆయన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా సందర్శిస్తారు. ఒబామా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ రంగ ఒప్పందాలు, పౌర అణు ఇంధన ఒప్పందంపై పురోగతి సాధించేందుకు కృషి జరుగుతుందని నిన్న గాంధీనగర్‌లో అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ చెప్పారు. గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నందున నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా విధుల్లో అమెరికా ఏజెన్సీలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు, సైన్యం, పారామిలిటరీ బలగాలతోపాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు కూడా పాలుపంచుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. ఉగ్రవాదులు ఏక్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశముందనే గూఢచార విభాగం హెచ్చరికల నేపథ్యంలో పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్సు టెర్మినళ్లు, మెట్రో రైల్వేస్టేషన్లు, మాల్స్ వంటి కీలక ప్రదేశాలలో ప్రత్యేక బృందాలు మోహరిస్తాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో రెండో పర్యాయం భారత పర్యటనకు వస్తున్న తొలి అధ్యక్షుడు ఒబామాయే కావటం విశేషం.