వాషింగ్టన్: ఉన్నత చదువుల కోసం పెద్ద కుమార్తె మాలియా(19)ను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేర్చినప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనై, కన్నీళ్లు పెట్టుకున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. మాలియాను వర్సిటీలో వదిలి వస్తుంటే తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతున్నంత బాధ కలిగిందన్నారు.
డెలావర్‌లోని బ్యూ బిడెన్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ విందు కార్యక్రమంలో ఒబామా మాట్లాడారు. మాలియాను హార్వర్డ్‌లో వదిలి వస్తున్న సమయంలో తనకు విపరీతంగా ఏడుపు వచ్చినప్పటికీ ఆమె ముందు ఏడ్వలేదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జో బిడెన్(మాజీ ఉపాధ్యక్షుడు) దంపతుల్ని ఉద్దేశించి ఒబామా అన్నారు. ఇందుకు తాను గర్వపడుతున్నట్లు సరదాగా వ్యాఖ్యానించారు.
తిరుగుప్రయాణంలో ముక్కు తుడుచుకుంటూ తాను చేసిన శబ్దాలు సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి వినిపించినప్పటికీ వారు విననట్లే నటించారని చమత్కరించారు. జీవితంలో మనం ఎంత సాధించినా, చివరికి మనకు సంతోషాన్నిచ్చేది మాత్రం పిల్లలేనన్నారు. మళ్లీ అదే స్థాయి ఆనందం మనవళ్లు, మనవరాళ్ల వల్లే దక్కుతుందని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో మాలియా ఐవీ లీగ్ స్కూల్‌లో చేరారు.