House Speaker Nancy Pelosi Husband Paul Pelosi Brutally Attacked - Sakshi
Sakshi News home page

యూఎస్‌ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్తపై పైశాచికంగా దాడి

Published Fri, Oct 28 2022 9:02 PM | Last Updated on Fri, Oct 28 2022 9:13 PM

House speaker Nancy Pelosi Husband Paul Pelosi Brutally Attacked - Sakshi

శాక్రమెంటో: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ అయిన నాన్సీ పెలోసీ భర్త పాల్‌ పెలోసీపై దాడి జరిగింది. ఈ దాడిలో పాల్‌ పెలోసీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం సమయంలో కాలిఫోర్నియాలోని ఆమె నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్పీకర్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

తైవాన్‌లో ఆమధ్య నాన్సీ పెలోసీ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆపై ఆమెపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది చైనా. ఇక ప్రస్తుత దాడి సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలుస్తోంది. డెమొక్రట్స్‌తో కలిసి ఆమె నవంబర్‌8న జరగబోయే మధ్యంతర ఎన్నికల కోసం ఫండ్‌రైజింగ్‌ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. ఘటన సమయంలో ఆమె వాషింగ్టన్‌లో ఉన్నారు. పోలీసుల అదుపులోనే దుండగుడు ఉండగా.. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  

ఆగంతకుడి దాడిలో పాల్‌ పెలోసీ(82).. ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. సుత్తితో ఇంట్లోకి ప్రవేశించాడు ఆగంతకుడు. అయితే దాడికి ఆ సుత్తిని ఉపయోగించాడా? అనేది తెలియాల్సి ఉంది. పాల్‌ పెలోసీ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. 

శాన్‌ఫ్రాన్సిస్కో(కాలిఫోర్నియా స్టేట్‌)కు చెందిన పాల్‌ పెలోసీ ప్రముఖ వ్యాపారవేత్త. నాన్సీ-పాల్‌కు 1963లో వివాహం జరిగింది. ఈ జంటకు ఐదుగురు సంతానం. ఈ కుటుంబం మొత్తం ఆస్తిపాస్తుల ద్వారా నాన్సీ పెలోసీ మొత్తం కాంగ్రెస్‌ సభ్యుల్లో అత్యంత ధనవంతురాలిగా నిలవడం విశేషం. బాల్టిమోర్‌కు చెందిన నాన్సీ పెలోసీ.. 1987 నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో తరపున కాంగ్రెస్‌కు ఎన్నికవుతూ(మధ్య మధ్యలో కాలిఫోర్నియా, వాషింగ్టన్‌ నుంచి కూడా) వస్తున్నారు. అమెరికాలో పవర్‌ఫుల్‌ నేతల్లో పెలోసీ ఒకరు. ప్రతినిధుల సభకు స్పీకర్‌గా 2021లో ఆమె నాలుగో సారి ఎన్నికయ్యారు. 

పాతికేళ్లలలో తైవాన్‌ను సందర్శించిన అమెరికా అతిపెద్ద నేత ఈమెనే కావడం గమనార్హం. స్పీకర్‌ నాన్సీ పావెల్‌ భర్తపై దాడి ఘటనను యూఎస్‌ఐ, యూఎస్‌ కాపిటోల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement