టెహ్రాన్: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణపై అమెరికా ఏర్పాటు చేసిన కూటమిలో భాగస్వామ్య దేశాలంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ గ్రూపు హెచ్చరించింది. కూటమి దేశాలన్నీ ఎర్ర సముద్రంలో తమ నౌకల భద్రతను కోల్పోవాల్సి వస్తుందని హౌతీ గ్రూపు సుప్రీం రివల్యూషనరీ కమిటీ సీనియర్ అధికారి మహ్మద్ అలీ అల్ హౌతీ తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నింగ్ ఇచ్చాడు.
తాము దాడులను పూర్తిగా ఆపే వరకు కూటమి దేశాల నౌకలకు ముప్పు తప్పదని స్పష్టం చేశాడు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్ జరుపుతున్న దాడులను ఎదుర్కొనేందుకు 12 దేశాలతో కలిసి అమెరికా ఒక కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో యూకే,ఆస్ట్రేలియా జపాన్ తదితర దేశాలున్నాయి. అయితే ఈ కూటమిలో తాము లేమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా తూర్పు, పశ్చిమ దేశాల సముద్ర రవాణాకు కీలకమైన ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మండెబ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై హౌతీలు డ్రోన్‌లతో ఇటీవల దాడులు చేస్తున్నారు. హౌతీల దాడులు మొదలైన తర్వాత ఈ రూట్‌లో భారత షిప్పింగ్ కంపెనీలు తమ నౌకల రవాణాను రద్దు చేసుకుని భారీ ఖర్చుతో కూడిన ఆఫ్రికా రూట్‌లో నౌకలను పంపుతున్నాయి.ఈ రూట్‌లో ఇండియా నుంచి నౌకలు అమెరికా, యూరప్‌లను చేరుకోవడానికి 14 రోజులు ఎక్కువ సమయం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment