![IMF suspends Afghanistan access to funds - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/20/IMF.jpg.webp?itok=GXL1e0Uz)
వాషింగ్టన్/కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ప్రస్తుతం ఎలాంటి రుణాలు ఇవ్వబోమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా తేల్చిచెప్పేసింది. ఇతర ఆర్థికపరమైన వనరులు కూడా సమకూర్చే ప్రశ్నే లేదని ఐఎంఎఫ్ స్పష్టంచేసింది. ఈ మేరకు తాజాగా ఐఎంఎఫ్ ఒక ప్రకటన జారీ చేసింది. తాలిబన్ల పట్ల అంతర్జాతీయ సమాజం వైఖరికి అనుగుణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
విదేశాల్లో రూ.66,600 కోట్లున్నాయి
ప్రస్తుతం తమ దేశంలో నగదు నిల్వలు ఏవీ లేవని అఫ్గానిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజ్మల్ అహ్మదీ చెప్పారు. అయితే విదేశాల్లో మాత్రం 9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.66,600 కోట్లు) ఉన్నాయని గవర్నర్ అజ్మల్ అహ్మదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. 9 బిలియన్ డాలర్లలో 7 బిలియన్ డాలర్లు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బాండ్లు, బంగారం, ఇతర ఆస్తుల రూపంలో ఉన్నాయని పేర్కొన్నారు. తమ వద్ద అమెరికా డాలర్లు నిండుకున్నాయన్నారు. అఫ్గాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడంతో విదేశాల నుంచి రావాల్సిన నగదు ఆగిపోయిందన్నారు. ఇక వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదన్నారు. అమెరికా డాలర్లు తగినన్ని లేకపోతే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని, ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని, ఫలితంగా సామాన్యులకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు.
అఫ్గాన్‌కు ఆయుధాల అమ్మకంపై నిషేధం
తాలిబన్ల పునరాక్రమణ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి అన్ని రకాల ఆయుధాల విక్రయంపై అమెరికా సర్కారు నిషేధం విధించింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు చెందిన రాజకీయ, సైనిక వ్యవహారాల బ్యూరో డిఫెన్స్ కాంట్రాక్టర్లకు నోటీసు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న లేదా ఇంకా అందజేయని ఆయుధాల విషయంలో పునఃసమీక్ష నిర్వహించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment