విమాన ప్రయాణాల్లో అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఇటీవలి కాలంలో తరుచూ నమోదవుతున్నాయి. కొందరు అభ్యంతరకరంగా ప్రవరిస్తూ తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి.
మరో ప్రయాణికునికి కేటాయించిన సీటులో కూర్చుని..
ఇటీవల టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు హంగామా సృష్టించాడు. నేపాల్‌కు చెందిన మహేశ్ పండిట్ అనే ప్రయాణికుడు విమాన సిబ్బందిని తీవ్రంగా దూషించడంతోపాటు లావేటరీ డోర్‌ను ధ్వంసం చేసి, నానా రభస చేశాడు. తనకు కేటాయించిన సీటులో కాకుండా వేరే సీటులో కూర్చుని ఆ ప్రయాణికునితో మహేష్ పండిట్ గొడవపడ్డాడు. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితునిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా తాకి..
గత ఏప్రిల్‌లో బ్యాంకాక్ నుంచి ముంబాయికి వస్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌తో పాటు ప్రయాణికులతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. విమానంలో ఆహారం అందుబాటులో లేదని ఎయిర్‌హోస్టెస్ చెప్పడంతో ఒక ప్రయాణికుడు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతసేపటి తరువాత ఆమె అందించిన చికెన్ డిష్ తీసుకునేందుకు అంగీకరిస్తూ, కార్డు స్వైపింగ్ పేరుతో ఆమెను అసభ్యంగా తాకాడు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయగా, మరింత రెచ్చిపోతూ అందరిముందు వేధించాడు. ఈ ఘటనపై సదరు ఎయిర్‌హోస్టెస్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీటు పక్కనే వాంతి చేసుకోవడంతో పాటు..
కొద్దిరోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు ముత్ర విసర్జన చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. గువాహటి నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో తన సీటు పక్కన వాంతి చేసుకున్నాడు. అంతటితో ఆగక టాయిలెట్ బయట మలవిసర్జన చేశాడు. ఫలితంగా విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కుక్క పిల్లను ఒడిలో పెట్టుకోవద్దనడంతో..
గత ఏడాది అట్లాంటా విమానాశ్రయంలో న్యూయార్క్ వెళ్లే విమానంలో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు తన వెంట ఒక కుక్క పిల్లను తెచ్చుకుంది. ట్రావెల్ కేజ్‌లో ఉంచాల్సిన ఆ కుక్క పిల్లను తన ఒడిలో ఉంచుకొని కూర్చుంది. దీనిని గమనించిన విమాన సిబ్బంది ఆ కుక్క పిల్లను కేజ్‌లో ఉంచాలని చెప్పడంతో, ఆగ్రహించిన ఆ మహిళ విమాన సిబ్బందిని తిట్టడంతోపాటు నానా హంగామా చేసింది. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా వెంటనే విమానం దిగాలని చెప్పిన ఒక ప్రయాణికుడిపై వాటర్ బాటిల్ విసిరింది. అయితే చివరకు ఆ మహిళను విమాన సిబ్బంది కిందకు దించారు. ఈ విషయాన్ని అట్లాంటా పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
గణిత సమీకరణాన్ని పరిష్కరిస్తూ..
ఆ మధ్య అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. విమానంలో గణిత సమీకరణాన్ని పరిష్కరించే విషయంలో తోటి ప్రయాణికుడు అనుమానంగా ప్రవర్తిస్తున్నాడని, విదేశీ స్క్రిప్ట్‌లో రాస్తున్నాడని ఒక మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ ప్రయాణికుడి కారణంగా తాను అనారోగ్యం పాలయ్యానని పేర్కొంది. ఇందుకు కారకుడైన ప్రొఫెసర్ గైడో మెన్జియోను అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ విమానం టేకాఫ్ చేయడానికి ముందు ప్రశ్నించింది. అసలు విషయం వెల్లడి కావడంతో ఆమెను ప్రత్యేక విమానంలో ఆమె చేరాల్సిన గమ్యస్థానానికి తరలించారు.
ఇది కూడా చదవండి: ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు
వీరు విమాన ప్రయాణికులేనా?.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర
Published Sat, Jul 15 2023 8:55 AM | Last Updated on Sat, Jul 15 2023 10:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment