
బ్రెజీలియా: కవల శిశువులు ఉమ్మనీటి సంచితో సహా పుట్టిన అత్యంత అరుదైన సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా ఉమ్మనీటి సంచి ప్రసవ సమయంలో దానంతటదే పగిలిపోతుంది. అలా కాకుండా శిశువు ఉమ్మ సంచితో పాటు పుట్టడం చాలా అరుదు. అందులోనూ ఈ కవలలిద్దరూ ఉమ్మ సంచితో పుట్టారు! వీటిని ‘ఎన్ కౌల్’ లేదా వెయిల్డ్ బర్త్స్ (ముసుగు జననాలు) అంటారట. ప్రతి 80,000 జననాల్లో ఒకసారి మాత్రమే ఇలా జరిగే చాన్సుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆడ శిశువుల ఉమ్మ సంచిని వైద్యులు సి–సెక్షన్ ద్వారా విచ్ఛిన్నం చేసి వారిని క్షేమంగా బయటికి తీశారు. దీన్నంతా వీడియో తీశారు. అదిప్పుడు ప్రపంచమంతటా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కవలలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారట. వీరికి మారియా సెసీలియా, మారియా అలైస్ అని పేర్లు పెట్టారు. తల్లి గర్భంలో పిండ దశలోనే చుట్టూ ఉమ్మ నీరు ఏర్పడుతుంది. జన్మించేదాకా అది సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది. గర్భస్థ పిండం ఉమ్మనీటి సంచిలోనే స్వేచ్ఛగా ఈదులాడుతుంది. శిశువు జన్మించే సమయం కంటే ముందే ఈ సంచి విచ్ఛన్న మవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment