భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు రోజురోజుకీ దెబ్బతింటున్నాయి. ఇటీవల కెనడాలో హిందూ ఆలయంపై దాడి జరగడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఆ దేశంలో కాన్సులర్ క్యాంప్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
‘కెనడాలోని భారత కమ్యూనిటీ క్యాంప్ నిర్వహకులకు కనీస భద్రత కల్పించలేమని అక్కడి భద్రతా ఏజెన్సీలు తెలిపాయి. అందువల్ల ముందుజాగ్రత్త చర్యలో భాగంగా మా షెడ్యూల్ కాన్సులర్ క్యాంప్‌లను రద్దు చేయాలని నిర్ణయించాం’’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
కాగా ఇటీవల కెనడాలో బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో సిక్కు వేర్పాటువాదులు వీరంగం సృష్టించారు. భక్తులపై దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఖలిస్థానీ జెండాలు పట్టుకున్న వ్యక్తులు.. కర్రలతో హిందూ సభా మందిరం ప్రాంగణంలోని వ్యక్తులపై పిడిగుద్దులు కురిపిస్తున్న దృశ్యాలు ఈ వీడియోల్లో కనిపించాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment