వాషింగ్టన్: అమెరికాలోని క్యాపిటల్ హిల్ బిల్డింగ్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇక దీని పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. పలువురు దేశాధినేతలు ఈ ఘటనను ఖండించారు. ఇక నిరసనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎందుకంటే ఆ వీడియోలో ఓ వ్యక్తి భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని కనిపించడం గమనార్హం. అయితే ఆ వ్యక్తి ఎవరు? అతడు ఏ పార్టీకి చెందినవాడన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కానీ అమెరికా ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసన కార్యక్రమంలో త్రివర్ణపతాకం కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.(చదవండి: బైడెన్ గెలుపును ధ్రువీకరించిన కాంగ్రెస్)
‘ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో మన జెండా ఎందుకుంది... ఇలాంటి చోట మన మద్దతు అనవసరం అంటున్నారు’ నెటిజనులు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా దీని మీద స్పందించారు. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. అక్కడ మన జెండా ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు. ఈ పోరాటంలో మనం పాలుపంచుకోవాల్సిన అవసరం అసలే లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియో ఈ రోజు జరగిన నిరసనకు సంబంధించిందా.. లేక పాత వీడియోని ఇప్పుడు మళ్లీ పోస్ట్ చేశారా అనేది ప్రస్తుతానికి తెలియలేదు. ఇక అమెరికా కాంగ్రెస్ బైడెన్‌ని అధ్యక్షుడిగా ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment