వాషింగ్టన్: ప్రపంచ దేశాలన్ని అమెరికా నూతన అధ్యక్షుడు ఎవరో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అధ్యక్ష పీఠం అధిరోహించడానికి గాను 270 ఓట్లు అవసరముండగా.. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 264 ఓట్లు సాధించి గెలుపు దిశగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి ట్రంప్ అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఓడిపోతే దేశం విడిచివెళ్లిపోతాను’.. ‘ఓడిపోయినా వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోను’ వంటి వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే ట్రంప్ ఓటమి ఖాయమని స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓ అమెరికన్ జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చూసిన వారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో మీరు చూడండి. జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన ఓ పేరడీ వీడియోను ట్వీట్ చేశారు. కామెడీ సెంట్రల్ అనే ఓ చానల్ 2017లో ‘ప్రెసిడెన్షియల్ డిస్ట్రాక్షన్ ఫోటో ఓప్’తో ఓ కార్యక్రమం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్‌ని పోలిన ఇద్దరు వ్యక్తులు ఓ స్కూల్‌కి వెళ్లి అక్కడి పిల్లలతో కలిసి ఆడి, పాడి.. చదువుకుని అక్కడే నిద్ర పోతారు. ఇందుకు సంబంధించిన వీడియోలోని ఒక నిమిషం నిడివి ఉన్న భాగాన్ని ప్రస్తుతం మోర్గాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇక దీనిలో ట్రంప్‌ని పోలిన వ్యక్తి పిల్లలతో కలిసి స్పేస్ హాప్పర్ బాల్ మీద కూర్చుని ఆడుతుంటాడు. ఇంతలో పెన్స్ వచ్చి బయలుదేరే సమయం ఆసన్నమయ్యింది అని అతడికి తెలియజేస్తాడు. దానికి ట్రంప్‌ని పోలిన వ్యక్తి 'నేను వెళ్లకూడదనుకుంటున్నాను' అంటూ పదే పదే అరుస్తాడు. దాంతో 'పెన్స్' అతనిని బంతి మీద నుంచి కింద పడేసి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంటాడు. "బంతిని వేరొకరికి ఇవ్వండి" అని ‘పెన్స్’ అంటే "ట్రంప్" ఏడుస్తూ నేలమీద బోర్లా పడి కొట్టుకుంటాడు. ఈ సీన్‌ని మోర్గాన్ ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలకి అన్వయించాడు. ‘ఓడిపోయిన్పటికి ట్రంప్ అధ్యక్ష పీఠం వదలడానికి ఇష్టపడడు. దాంతో ఆయనను ఇలానే బయటకు గెంటేయాల్సి వస్తుంది’ అన్నారు. (చదవండి: తలకిందులవుతున్న ట్రంప్ ఆశలు..)
ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు.. ‘పొట్ట చెక్కలయ్యేలా నవ్వాను. ప్రస్తుత పరిస్థితికి ఈ వీడియో సరిగ్గా సరిపోతుంది’ అని ఒకరు.. ‘సడెన్‌గా చూసి నిజంగా డొనాల్డ్ ట్రంపే అనుకున్నాను. వాస్తవ పరిస్థితి కూడా ఇలానే ఉంది’.. ‘ఫలితాల తర్వాత ట్రంప్ ఇలానే ప్రవర్తిస్తారేమో.. ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో వర్ణించడానికి మాటలు లేవు’ అని మరోకరు అన్నారు. మరోక వ్యక్తి ‘ట్రంప్‌ని కూడా వైట్‌హౌస్ నుంచి ఇలానే బలవంతంగా బయటకు పంపాల్సి వస్తుందేమో’ అంటూ కామెంట్ చేశారు. ఇక మోర్గాన్ ‘ఓడిపోవడం ట్రంప్‌కి ఇష్టముండదు. గత వారం అతడు ఇదే విషయాన్ని చెప్పాడు. ఓడిపోవడం అంటే తనకసహ్యమని.. దాన్ని ఒక పీడకలగా భావిస్తానని తెలిపారు. ఓడిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అలాంటి పరిస్థితి ఎదురయితే.. హుందాగా ఓటమిని అంగీకరించి తప్పుకోవాలి’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment