Indian Origin Family Hailed For Returning Lost Lottery Ticket of Over ₹ 7 Crore In Massachusetts - Sakshi
Sakshi News home page

భారత సంతతి కుటుంబం నిజాయతీ.. రూ.7 కోట్లు తిరిగిచ్చేసింది

Published Tue, May 25 2021 4:36 PM | Last Updated on Tue, May 25 2021 6:29 PM

Indian Origin Family Hailed for Returning Lost Lottery Ticket of Over Rs 7 Crore - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మసాచుసెట్స్‌: రూపాయి దొరికితేనే ఎవరి కంటబడకుండా జేబులో వేసుకుని.. అక్కడ నుంచి జారుకునే రోజులివి. అలాంటిది ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయలు దొరికితే ఎవరైనా తిరిగిచ్చేస్తారా.. ఎక్కువ శాతం మంది చెప్పే సమాధానం లేదనే. కానీ అక్కడక్కడ కొందరు నిజాయతీపరులుంటారు. వారి దృష్టిలో పరుల సొమ్ము పాముతో సమానం. అందుకే ఎంత భారీ మొత్తం దొరికినా అందులో రూపాయి కూడా ముట్టరు. 

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. భారత సంతతి కుటుంబం తమకు దొరికిన 1 మిలియన్‌ డాలర్‌(7,27,80,500 రూపాయలు) ప్రైజ్‌మనీ గెలుచుకున్న లాటరీ టికెట్‌ను దాని యజమానిదారుకు అప్పగించారు. ప్రస్తుతం ఆ కుటుంబంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనలు. 

ఆ వివారలు.. మౌనిశ్‌ షా అనే భారత సంతతి వ్యక్తి మసాచుసెట్స్‌లో సొంతంగా ఓ స్టోర్‌ నడుపుతున్నాడు. లాటరీ టికెట్లను కూడా అమ్ముతుంటారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మౌనిశ్‌ షా భార్య 1 మిలియన్‌ డాలర్‌ విలువ చేసే లాటరీ టికెట్‌ని లీస్‌ రోజ్‌ ఫిగా అనే మహిళకు అమ్మింది. అదృష్టం కొద్ది ఆ టికెట్‌కే లాటరీ తగిలింది.

అయితే లీస్‌ రోజ్‌ షిగా ఆ టికెట్‌ని సరిగా స్క్రాచ్‌ చేయకుండానే.. తనకు లాటరీ తగలలేదని భావించి స్టోర్‌లో ఉన్న చెత్త డబ్బాలో పడేసింది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే మౌనిశ్‌ షా కుమారుడు అభి షా సాయంత్ర డస్ట్‌బిన్‌లో ఉన్న టికెట్‌లను బయటకు తీసి చెక్‌ చేయగా.. లీస్‌ రోజ్‌ ఫిగా టికెట్‌ను సరిగా స్క్రాచ్‌ చేయ‍కపోవడం చూసి.. దాన్ని పూర్తిగా గీకి చూడగా.. ఆ నంబర్‌కే లాటరీ తగిలిందని గమనించాడు. చేతిలో ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే టికెట్‌ చూసి అభి ఉద్వేగానికి లోనయ్యాడు. 

వెంటనే దీని గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. ముందు అభి ఆ డబ్బుతో టెస్లా కారు కొనాలని భావించాడు. కానీ అతడి తల్లిదండ్రులు ఆ టికెట్‌ను దాన్ని కొన్న లీస్‌ రోజ్‌ ఫిగాకు అప్పగించాలని భావించారు. దీని గురించి అభి భారతదేశంలో నివసిస్తున్న తన తాతయ్య, నానమ్మలకు చెప్పగా వారు కూడా ఆ టికెట్‌ ఎవరిదో వారికి తిరిగి ఇచ్చేయమన్నారు. ‘‘దాన్ని మన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్‌ కాదు. టికెట్‌ వారికి తిరిగి ఇచ్చేయండి.. ఒకవేళ మీ అదృష్టంలో రాసిపెట్టి ఉంటే మీకే సొంతమవుతుంది’’ అన్నారు. దాంతో ఆ టికెట్‌ను లీస్‌ రోజ్‌ ఫిగాకు తిరిగి ఇచ్చేయాలని భావించాను’’ అన్నాడు అభి షా.

ఇక మరుసటి రోజు అభి తల్లిదండ్రులను తీసుకుని లీస్‌ రోజ్‌ ఫిగా పని చేస్తున్న చోటకు వెళ్లి.. ‘‘మా అమ్మనాన్న మీతో మాట్లాడాలనుకుంటున్నారు.. ఒక్క నిమిషం బయటకు రండి అని పిలిచాను. బయటకు వచ్చాక ఆమెకు తను కొన్న టికెట్‌ అప్పగించాం’’ అన్నాడు. ఈ సందర్భంగా లీస్‌ రోజ్‌ ఫిగా మాట్లాడుతూ.. ‘‘అక్కడి వెళ్లాక వారు నా చేతిలో నేను డస్ట్‌బిన్‌లో పడేసిన టికెట్‌ నా చేతిలో పెట్టారు. దానికే ప్రైజ్‌మనీ వచ్చిందని తెలిపారు. అది చూసి నా కళ్లని నేను నమ్మలేకపోయాను.. సంతోషంతో అక్కడే కూర్చుని గట్టిగా ఏడ్చాను. ఆ తర్వాత వారిని కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపాను. లోకంలో ఇంత నిజయాతీపరులు ఉంటారని కలలో కూడా ఊహించుకోలేదు. జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. దేవుడు వారిని చల్లగా చూడాలి’’ అని తెలిపింది. 

చదవండి: నాన్న ఇచ్చిన నాణెం: కోట్లు కురిపించింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement