లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి భారత సంతతికి చెందిన వ్యక్తికి లభిస్తుందా? బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్ ప్రధాని రేసులో ముందున్నారా ? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన రిషి చరిత్ర సృష్టిస్తారా ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బ్రిటన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటన్‌లో కరోనా మొదటి వేవ్ లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు 2020 మేలో ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన మందు పార్టీ వివాదం ముదురుతోంది.
కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ బోరిస్ జాన్సన్ ఇచ్చిన పార్టీ వీడియో ఒకటి ఇటీవల వెలుగులోకి రావడంతో విపక్ష లేబర్ పార్టీలో, సొంత పార్టీ కన్జర్వేటివ్‌లలో వ్యతిరేకత పెరుగుతోంది. బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు జరిగిన గత ఏడాది ఏప్రిల్ 17 ముందు రోజు రాత్రంతా డౌనింగ్ స్ట్రీట్‌లో 30 మంది మందులు, చిందులతో కాలం గడిపారన్న ఆరోపణలు తాజాగా వస్తున్నాయి. ఫిలిప్ భౌతిక కాయం ఉన్న సమయంలో అలాంటి పార్టీలు జరుపుకోవడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
‘పార్టీ గేట్’ వివాదంపై బోరిస్ జాన్సన్ బ్రిటన్ పార్లమెంటులో క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రధాని పీఠం దిగాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన స్థానంలో భారతీయ మూలాలున్న రిషి ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలను కొట్టి పారేయలేమని బ్రిటన్ మీడియాలో వార్తలొచ్చాయి. బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బోరిస్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో క్షమాపణ చెప్పే సమయంలో రిషి సభలో లేకపోవడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.
ఆర్థిక మంత్రి అయినప్పట్నుంచే రిషి ప్రధాని పీఠంపై మక్కువ పెంచుకున్నారని, అందుకే ‘పార్టీగేట్’ వివాదానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో సభకు హాజరుకాలేదని బోరిస్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టిన రిషి తన శాఖకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండడం వల్లే సభకు హాజరు కాలేదంటూ ట్వీట్ చేశారు. కోవిడ్ విలయంతో తరచూ లాక్‌డౌన్లతో కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి పట్టాలెక్కించడానికి రిషి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన రిషి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. వీరికి కృష్ణ, అనుష్క అనే కుమార్తెలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment