సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ స్థానికులను ప్రసన్నం చేసుకొనేందుకు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా నిబంధనల పేరుతో విసిరిన రాజకీయ కార్డు అగ్రరాజ్యంలోని భారతీయుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. వీసాల రెన్యువల్‌తోపాటు కొత్త వీసాల దరఖాస్తుకు ప్రస్తుత మున్న నిబంధనలను కఠినతరం చేస్తూ విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ పాలనా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని దాదాపు 2.8 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడి కంపెనీలకు కన్సల్టెన్సీలుగా పనిచేస్తున్న భారతీయ ఐటీ కంపెనీలకు కూడా తాజా ఉత్తర్వుల వల్ల భారీ నష్టం జరగనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారే కాక పలు యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఉపాధి అవకాశాలకు కూడా ఈ ఉత్తర్వులు గండి కొడతాయని అంటున్నారు.
మనోళ్లకు గడ్డుకాలమే...
తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో కనీస వార్షిక వేతన పరిమితి ఏకంగా 45 శాతం పెంపుతోపాటు కంపెనీ ఉద్యోగులు, కన్సల్టెన్సీ ఉద్యోగుల వీసాల రెన్యువల్ కాలపరిమితిలో మార్పు, రెన్యూవల్ ఫీజు పెంపు, అమెరికాలో ఐటీ సంబంధిత అడ్వాన్స్‌డ్ డిగ్రీ పూర్తి చేసినవారికే వీసాలివ్వాలనే నిబంధనలు ఉండటం భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేయనున్నాయి. ఇకపై హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు 1.10 లక్షల డాలర్ల కనిష్ట వార్షిక వేతనం ఉంటేనే వీసా పొందడానికి అర్హత పొందుతారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం 65 వేల డాలర్లుంటేనే వీసాకు దరఖాస్తు చేసుకొనే అవకాశముండేది. ఈ నిబంధనల అమలు వల్ల సగం మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం ఎదురుకానుంది.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ సామాజిక అధ్యయనాల సంస్థ సర్వే ప్రకారం హెచ్1బీ వీసాపై అమెరికాలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 56 శాతం మంది... అంటే దాదాపు 3.5 లక్షల మంది ఏటా 67 వేల నుంచి లక్ష డాలర్లలోపు వార్షిక వేతనం పొందుతున్నారు. వారిలో 2.80 లక్షల మంది భారతీయ ఐటీ ఉద్యోగులే ఉన్నారు. తాజా నిబంధనలతో వారంతా ప్రస్తుత వీసా గడువు ముగిశాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారి వార్షిక వేతనం 1.10 లక్షల డాలర్లు ఉండాల్సిందే. వార్షిక వేతనం 1.10 లక్షల డాలర్లు ఉన్న ఉద్యోగుల వీసా కాలపరిమితిలోనూ మార్పులు జరిగాయి. ఇంత మొత్తంలో వేతనం ఉన్నప్పటికీ వారు నేరుగా కంపెనీ ఉద్యోగులు అయితేనే వీసాను మూడేళ్లపాటు రెన్యువల్ చేయనున్నారు. అదే కన్సల్టెన్సీల ద్వారా కంపెనీలకు పనిచేసే వారి వీసాలను మాత్రం కేవలం ఏడాదికే ఇవ్వనున్నారు. ఈ నిబంధనల అమలు అమెరికన్ ఐటీ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను అందించే దాదాపు 65 వేల కన్సల్టెన్సీ సంస్థలకూ నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏమవుతుంది?
ట్రంప్ తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కోర్టుల్లో సవాల్ చేస్తే న్యాయ సమీక్ష ముందు నిలవదనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయమై యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన ప్రొఫెసర్ రెజినా డిక్షన్ మాట్లాడుతూ ‘ట్రంప్ పాలనా యంత్రాంగం తెచ్చిన కొత్త ప్రతిపాదనలు న్యాయ సమీక్ష ముందు నిలుస్తాయా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అమెరికాలో స్థానికంగా ఐటీ నిపుణులు దొరకడమన్నది అంత తేలికైన విషయం కాదు. అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా ఉంటే కంపెనీలు ఇతర దేశాలకు తరలే ప్రయత్నాలు తప్పక చేస్తాయి’అని అభిప్రాయపడ్డారు.
నెల జీతం వీసా ఖర్చుకే..!
తాజా నిబంధనలతో ఏటా వీసాలు రెన్యువల్ చేసుకోవాల్సి రావడం కన్సల్టెన్సీ ఉద్యోగులకు భారం కానుంది. ఒక్కసారి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలంటే వీసా ఫీజు, అటార్నీ ఖర్చులన్నీ కలిపి 7–8 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది. అంటే ఏటా దాదాపు ఒక నెల జీతం వీసా ఖర్చుకే సరిపోతుందన్నమాట. ఇక అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకూ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అశనిపాతంగా మారనుంది. గురువారం నుంచి అమల్లోకి వచ్చిన వీసా నిబంధనల ప్రకా రం అమెరికాలో అడ్వాన్స్‌డ్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్ అయినవారికి, అది కూడా ఐటీ చదువులు చదివినవారికే వీసాలు జారీ చేయనున్నారు. ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్ చేసినవారిని ఐటీ ఉద్యోగాలకు అనుమతించరు. అమెరికాలో ఏదో ఒక ఎంఎస్ డిగ్రీ చేసి ఐటీ ఉద్యోగం చేయొచ్చనుకొనే వారి ఆశలు గల్లంతైనట్లే. సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయి నవారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఐటీ సబ్జెక్టులు చదవనివారు ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు దొరకబుచ్చుకున్నా వారికి ఇకపై హెచ్1బీ వీసా ఇవ్వడం కుదరదు. ప్రస్తుతం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న 3 లక్షల మందిలో సగం మంది ఐటీయేతర గ్రాడ్యుయేట్ కోర్సు ల్లోనే ఉన్నారు. తాజా నిబంధనలతో వారి భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. (చదవండి: ‘హెచ్1బీ’పై మరిన్ని ఆంక్షలు)
Comments
Please login to add a commentAdd a comment