వాషింగ్టన్ : భారతీయ ఐటీ నిపుణులకు షాకిచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఏజెన్సీలు విదేశీయులు ప్రధానంగా హెచ్1బీ వీసా హోల్డర్ల నియామకాలను నిరోధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇటీవల హెచ్1బీ సహా ఇతర వర్క్ వీసాల జారీ ప్రక్రియపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించిన సుమారు నెలరోజుల తరువాత కీలకమైన ఎన్నికల సమయంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.
అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంలో భాగంగా ట్రంప్ ఈ కీలక అడుగు వేశారు. అమెరికన్లను ఉద్యోగాల్లో నియమించుకునేలా ఈ ఆర్డర్ పై సంతకం చేస్తున్నానని ట్రంప్ వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో ప్రకటించారు. అమెరికన్లకు ఉద్యోగాలు అనేదానికి తాము కట్టుబడి ఉన్నామని, చవకైన విదేశీ ఉద్యోగుల పేరుతో అమెరికన్లకు నష్టం జరుగుతోంటే తమ ప్రభుత్వం సహించదని ట్రంప్ స్పష్టం చేశారు. తాజా నిర్ణయం భారతీయ ఐటీ రంగానికి దెబ్బేనని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు.
మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకే తమ ప్రాధాన్యత అని హెచ్1బీ రెగ్యులేషన్‌ను త్వరలోనే ఖరారు చేయనున్నామని ట్రంప్ ప్రకటించారు. నిపుణులైన అమెరికన్ల స్థానంలో ‘చౌక’గా పనిచేసే విదేశీ సిబ్బందిని తాము అనుమతించమని తెలిపారు. హెచ్1బీ వీసాలను అత్యున్నత నైపుణ్యమున్న అమెరికా సిబ్బందికి వర్తింపజేస్తామన్నారు. తద్వారా అమెరికన్ పౌరులకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఎంపిక చేయడం ముఖ్యంగా మహమ్మారి సంక్షోభ సమయంలో నష్టదాయకమని ఇది ఇప్పటికే మిలియన్ల మంది అమెరికన్లు ఉద్యోగాలను నష్టపోయారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ ఏడాది చివరివరకు హెచ్1బీతోపాటు ఇతర అన్ని రకాల విదేశీ వర్క్ వీసాలను సస్పెండ్ (రద్దు) చేస్తూ గత జూన్ 23న ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment