లండన్: మన సమాజంలో పురుషుడు విడాకులు తీసుకోవడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అదే మహిళ విడాకులు కోరితే.. బయటి వాళ్ల సంగతి పక్కన పెట్టండి ముందు ఆమె కుటుంబ సభ్యులే అంగీకరించరు. ముందు నచ్చచెప్పడం.. తర్వాత బెదిరించడం చేస్తారు. అప్పటికి కూడా వినకపోతే.. ఆమెను వెలి వేస్తారు. చిన్న చూపు చూస్తారు. విడాకులు తర్వాత ఆమెకు జీవితమే లేదన్నాట్లు ప్రవర్తిస్తారు. తాజాగా ఓ మహిళ విడాకులు వచ్చిన సందర్భంగా ఘనంగా పార్టీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ విడాకుల పార్టీకి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ వివరాలు..
భారతదేశానికి చెందిన సోనియా గుప్తా చాలా స్వతంత్ర భావాలు గల మహిళ. మనసుకు నచ్చినట్లు జీవించేది. ప్రయాణాలను చాలా ఇష్టపడేది. హాయిగా సాగిపోతున్న సోనియా జీవితానికి పెళ్లితో బ్రేక్ పడింది. 2003లో సోనియా వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. వివాహం అనంతరం ఆమె భర్తతో కలిసి లండన్ వెళ్లింది. ఇక ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.
(చదవండి: ముసలోడు మామూలోడు కాదు.. ఆ చీటీలో ఏం రాశాడంటే..)
అత్తారింట్లో ఊపిరాడలేదు..
అత్తారింట్లో అడుగుపెట్టిన సోనియాకు అడుగడుగునా ఆంక్షలే. ఊపిరాడేది కాదు. దానికి తోడు భార్యభర్తల మధ్య బంధం పెద్దగా బలపడలేదు. తమ ఇద్దరికి సెట్ అవ్వదని సోనియాకు అర్థం అయ్యింది. అందుకే ఆ బంధం నుంచి విడిపోవాలని భావించింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు విడాకులు అనే మాట వింటూనే ఉగ్రరూపం దాల్చారు. అలాంటివి ఏం కుదరవని తేల్చి చెప్పారు. భర్తతో కలిసి ఉండాల్సిందేనని సోనియాను ఆదేశించారు.
ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. ‘‘నేను నాలా ఉండాలనుకున్నాను. పెళ్లికి ముందు నేను చాలా చురుగ్గా.. సరదాగా ఉండేదాన్ని. అత్తింటి వాతావరణంలో నేను ఇమడలేకపోయాను. నరకంలా తోచేది. కలిసి ఉండలేను.. విడిపోతాను అన్నాను. కానీ నా కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. నాకు ఎవరు మద్దతు ఇవ్వలేదు. నా మానసిక ఆరోగ్యం గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు’’ అని తెలిపారు.
(చదవండి: రాజ్‌కుంద్రాకు బెయిల్: భర్తతో శిల్పా విడిపోతుందా?)
ఆ ఇద్దరే నాకు బలం..
‘‘ఆ సమయంలో నా ఇద్దరు మిత్రులు మిఖాల్, షాయ్ నాకు మద్దతుగా నిలిచారు. ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చూపారు. అలానే విడాకుల విషయంలో నాకు ఏషియన్ సింగిల్ పేరెంట్ నెట్‌వర్క్ నుంచి మద్దతు కూడా లభించింది. ఇక మూడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నాకు విడాకులు లభించాయి. 17 ఏళ్ల వైవాహిక బంధం నుంచి నాకు విముక్తి లభించింది’’ అని తెలిపారు.
విడాకుల పార్టీ ఇవ్వడానికి కారణం ఇదే..
విడాకులు వచ్చిన సందర్భంగా సోనియా గుప్తా తన లండన్ నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇక స్నేహితులతో కలిసి తన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఆమె ధరించిన డ్రెస్ మీద ఫైనల్లీ డివోర్స్‌డ్ అనే ట్యాగ్ ధరించింది. స్నేహితులను కూడా మంచి దుస్తులు ధరించి వచ్చేలా ప్రోత్సాహించారు.
(చదవండి: విడాకుల ప్రకటన.. వైరలవుతోన్న శిఖర్ ధావన్ పోస్ట్)
ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. "నేను థీమ్‌ను రంగురంగులగా, ప్రకాశవంతంగా, యునికార్న్‌లతో నిండి ఉండేలా ఎంచుకున్నాను. ఎందుకంటే నేను కూడా నా జీవితం ఇలానే ఉండాలని భావించాను. 10 సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి సంతోషం తిరిగి వచ్చింది. ఈ మాత్రం సెలబ్రెషన్స్‌కు, మ్యాజిక్‌కు నేను అర్హత కలిగి ఉన్నానని అనుకుంటున్నాను’’ అని తెలిపారు.
సోనియా కోరుకున్నట్లే, విడాకుల పార్టీలో ప్రతి ఒక్కరూ ఆనందించడానికి బౌన్సీ కాసిల్, గులాబీ, ఊదా రంగులతో నిండిన అలంకరణలు, ఇంద్రధనస్సు, యునికార్న్ థీమ్‌తో పాటు కస్టమ్ కేక్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విడాకుల సంబరాన్ని సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
చదవండి: 'విడాకుల తర్వాత జీవితం ఇలా'.. ఫోటో షేర్ చేసిన సుమంత్
Comments
Please login to add a commentAdd a comment