హిప్పో నోట్లో బాటిల్, ఇన్‌సెట్‌లో నిందితురాలు
జకార్తా : సరదానో.. మానసిక పరిస్థితి బాగోలేకనో కొంతమంది సైకోల్లాగా వ్యవహరిస్తుంటారు. తమకు నచ్చినట్లు.. ఇష్టం వచ్చినట్లు చేసి ఇతరులను, కొన్ని కొన్ని సార్లు మూగ జీవాలను హింసిస్తుంటారు. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ కూడా అదే పని చేసింది. తన తల తిక్కపనికి ఓ మూగ జీవి ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టబోయింది. వివరాలు.. కొద్దిరోజుల క్రితం ఇండోనేషియా, జావాకు చెందిన ఓ మహిళ అక్కడి తమన్ సఫారీకి వెళ్లింది. కారులో అన్ని జంతువుల్ని తిరిగిచూస్తున్న ఆమె నీటిలో ఉన్న హిప్పో నోట్లోకి వాటర్ బాటిల్, టిష్యూ పేపర్ విసిరింది.
ఇది గమనించిన సింటియా ఆయూ అనే మహిళ హిప్పో నోట్లోని వస్తువులను వీడియో తీసింది. అనంతరం సఫారీ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెటర్నరీ వైద్యులు హిప్పోకు వైద్య పరీక్షలు నిర్వహించి బాటిల్‌ను బయటకు తీశారు. అనంతరం డోని హెర్డారు అనే వ్యక్తి నిందితురాలైన మహిళను కథిజాహ్‌గా గుర్తించాడు. తాను చేసిన పనికి క్షమాపణ చెబుతూ కథిజాహ్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ సంఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నువ్వు మహిళవు కాదు! సైకోవి’’.. ‘‘నువ్వు మనిషివేనా? మానవత్వం ఉందా’’ అంటూ మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment