75 వేల మందిపై అధ్యయనం: ఫ్లూ వ్యాక్సిన్‌తో కోవిడ్‌ నుంచి రక్షణ | Influenza Vaccine Can Reduce Covid 19 Effects On Victims Study Says | Sakshi
Sakshi News home page

75 వేల మందిపై అధ్యయనం: ఫ్లూ వ్యాక్సిన్‌తో కోవిడ్‌ నుంచి రక్షణ

Published Tue, Jul 13 2021 10:42 AM | Last Updated on Tue, Jul 13 2021 11:14 AM

Influenza Vaccine Can Reduce Covid 19 Effects On Victims Study Says - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: ఇన్‌ఫ్లూయెంజా(ఫ్లూ) వ్యాక్సిన్‌ తీవ్రమైన కోవిడ్‌–19 ప్రభావాల నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ మియామి మిల్లర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ ఆధ్వర్యంలో జరిగిన తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. దీన్ని తీసుకున్నవారు కరోనా మహమ్మారి బారినపడినప్పటికీ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఐసీయూ)తో పాటు ఎమర్జెన్సీ వార్డులో చేరే అవకాశాలు గణనీయంగా తగ్గుతున్నట్లు తేలింది. అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీ, ఇజ్రాయెల్, సింగపూర్‌ తదితర దేశాల్లో 75,000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఫ్లూ టీకాతో ఎన్నో రకాలుగా రక్షణ లభిస్తుందని, కోవిడ్‌–19 బాధితుల్లో స్ట్రోక్, సెప్సిస్, డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌(డీవీటీ) వంటి 15 ప్రతికూల ప్రభావాల రిస్కును తగ్గిస్తుందని అధ్యయనకర్తలు చెప్పారు.

కరోనా సోకిన తర్వాత ఫ్లూ టీకా తీసుకున్నా మంచి ఫలితాలు లభిస్తున్నట్లు తెలిపారు. కరోనాలో ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఫ్లూ టీకాతో రక్షణ లభిస్తుందని తేలడం కీలక పరిణామం అని యూని వర్సిటీ ఆఫ్‌ మియామి మిల్లర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ దేవిందర్‌ సింగ్‌ చెప్పారు. ఫ్లూ టీకా తీసుకోని కోవిడ్‌ బాధితులు ఐసీయూలో చేరే అవకాశం 20 శాతం, ఎమర్జెన్సీ వార్డులో చేరే అవకాశం 58 శాతం అధికంగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది.

అయితే, మరణం సంభవించే అవకాశాలను మాత్రం ఫ్లూ వ్యాక్సిన్‌ తగ్గించలేదని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొం టున్న దేశాల్లో ఫ్లూ టీకాను ఉపయోగించుకోవచ్చని అధ్యయనకర్తలు సూచించారు. కరోనా వ్యాక్సిన్‌కు ఇది ప్రత్యామ్నాయం కాదని తేల్చిచెప్పారు. అయితే, కోవిడ్‌కు వ్యతిరేకంగా ఫ్లూ టీకా రక్షణ కల్పించడానికి గల కారణాలను పరిశోధకులు స్పష్టంగా గుర్తించలేకపోయారు. ఈ వ్యాక్సిన్‌ మనుషుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేటతెల్లమయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement