బీజింగ్: కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చైనా నుంచే ఈ వైరస్ వ్యాప్తి మొదలైందని.. డ్రాగన్ కావాలనే ఈ వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిందనే ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలో దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వూహాన్‌లో పర్యటించింది. ఈ నేపథ్యంలో తాజాగా డ్రాగన్.. అమెరికాకు సవాల్ చేసింది. వైరస్ అగ్రరాజ్యం నుంచే వ్యాప్తి చెందిందని.. దీనిపై దర్యాప్తు చేయడానికి డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులను అమెరికాకు ఆహ్వానించాలని చైనా సవాలు చేసింది.
ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్సిన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అమెరికాలోని ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌తో సహా ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో కోవిడ్ ఆవిర్భవించినట్లు అనేక నివేదికలు ఉన్నాయి. వైరస్ విషయంలో మా దేశంపై చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపించడానికి మేం డబ్ల్యూహెచ్‌ఓ దర్యాప్తును స్వాగతించాం. ఇప్పుడు అమెరికా కూడా చైనా వంటి శాస్త్రీయ, సహకార వైఖరిని అవలంబించాలి. వైరస్ మూలాన్ని గుర్తించడంపై పరిశోధనలు చేయటానికి అమరికా, డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులను తన దేశం ఆహ్వానించగలదని మేము ఆశిస్తున్నాము’’ అన్నారు.
అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ చైనాలో 2019 నవంబర్‌లో అనారోగ్యానికి గురైన తొమ్మిది మంది వైద్య రికార్డులను విడుదల చేయాలంటూ చేసిన డిమాండ్‌కు బదులుగా చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. వీలైనంత త్వరగా అమెరికా ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని, మహమ్మారిపై మానవజాతి విజయానికి తగిన కృషి చేయాలి అని వెన్సిన్ తెలిపారు. భవిష్యత్తులో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులకు మెరుగ్గా స్పందించాలి అని ఆయన సూచించారు.
తొలి కోవిడ్ కేసులు నివేదించడానికి ఒక నెల ముందు 2019 లో వుహాన్‌లోని ఒక చైనీస్ వైరాలజీ ప్రయోగశాలలో9 మంది పరిశోధకులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఫౌసీ వారి రికార్డులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment