గాజా స్ట్రిప్‌లోని రఫాలో ఇజ్రాయెల్ దాడుల్లో నేలమట్టమైన భవన శిథిలాల వద్ద విచార వదనంతో బాలిక
దెయిర్ అల్ బలా (గాజా): ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది. మంగళవారం ఇజ్రాయెల్ క్షిపణుల ధాటికి వందలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. ఒక్క రోజే ఏకంగా 300 ‘లక్ష్యాలను’ ఛేదించినట్టు సైన్యం ప్రకటించింది. ముఖ్యంగా శరణార్థుల ఆవాస ప్రాంతంలోని కనీసం ఆరు అపార్ట్‌మెంట్లను ఇజ్రాయెల్ రాకెట్లు కుప్పకూల్చాయి.
ఈ దారుణంలో భారీగా జన నష్టం జరిగిందని హమాస్ ఆరోపించింది. మృతుల సంఖ్యపై ఇప్పటిదాకా స్పష్టత రాకున్నా వందల మంది చనిపోయి ఉంటారని చెబుతున్నారు. శిథిలాల దిబ్బల్లో తమవారి కోసం వెదుకుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. వీడియో ఫుటేజీల్లో రక్తమోడుతున్న ఇద్దరు బాలలను కొందరు యువకులు భుజాలపై వేసుకుని తీసుకొస్తూ కల్పించారు.
మరోవైపు నుంచి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు ఉత్తర గాజాపై శతఘ్నుల వర్షం కురిపిస్తున్నాయి. అక్కడి హమాస్ ఉగ్రవాద సంస్థ తాలూకు భూగర్భ నిర్మాణాలపై ప్రత్యక్ష దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పలుచోట్ల పెద్దపెట్టున కాల్పులు జరుగుతున్నాయి. ఉత్తర గాజాలో ఇంకా లక్షల మంది పాలస్తీనియన్లు చిక్కిపోయి ఉన్న నేపథ్యంలో ప్రాణ నష్టం ఏ స్థాయికి పెరుగుతుందోనంటూ సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయినా హమాస్‌ను నిర్మూలించేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. ఐరాస సహాయక సంస్థలకు చెందిన 64 మంది సిబ్బంది ఇప్పటిదాకా దాడులకు బలయ్యారు. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది తమ సిబ్బంది మరణించడం ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ పోరులోనూ జరగలేదని ఐరాస అధికార ప్రతినిధి వాపోయారు. ఇప్పటిదాకా పోరుకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 9,000 దాటినట్టు తెలుస్తోంది.
హమాస్ అగ్ర నేత హతం!
మంగళవారం వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్ అగ్ర నేత సలేహ్ అల్ అరౌరీ నివాసాన్ని నేలమట్టం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దాడిలో అతను కూడా మరణించి ఉంటాడని భావిస్తున్నారు. అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ భారీ మెరుపుదాడికి పథక రచన చేసిన హమాస్ ఉత్తర డివిజన్ కమాండర్ నసీమ్ అబు అజీనా కూడా తమ యుద్ధవిమానాల దాడిలో హతమైనట్టు సైన్యం పేర్కొంది.
సైనికురాలి విడుదల
హమాస్ చెర నుంచి ఒరీ మెగిదీష్ అనే తమ సైనికురాలిని విజయవంతంగా విడిపించుకున్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ఆమెను అక్టోబర్ 7న మెరుపుదాడి సందర్భంగా ఉగ్రవాదులు అపహరించినట్టు వివరించింది. ఆమె తన కుటుంబ సభ్యులతో ఉన్న తాజా ఫొటోను ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసింది. హమాస్ చెరలో ఇంకా 240 మందికి పైగా బందీగా ఉన్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది.
సముద్రమార్గంలో సాయం: సైప్రస్
అత్యవసరాలకు కూడా దిక్కు లేక అల్లాడుతున్న గాజావాసులను ఆదుకునేందుకు సైప్రస్ ముందుకొచ్చింది. ఐరోపా సమాఖ్య, మధ్య ప్రాచ్య దేశాలు సహకరిస్తే సముద్రమార్గ నడువా(సీ కారిడార్) ఏర్పాటు చేసి నిత్యావసరాలను గాజాకు చేరవేస్తామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment