షిఫా ఆస్పత్రిలో సొరంగాన్ని మీడియాకు చూపిస్తున్న ఇజ్రాయెల్ సైనికుడు
ఖాన్ యూనిస్: గాజాలో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ, దాదాపు 50 మంది బందీలకు విముక్తి, ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా ఫైటర్ల విడుదలపై ఇజ్రాయెల్–హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం ఒక్కరోజు ఆలస్యంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. ఖతార్ ఈ విషయాన్ని గురువారం ప్రకటించింది. తొలుత 13 మంది బందీలు విడుదలవుతారని తెలియజేసింది.
వాస్తవానికి గురువారం ఉదయం నుంచే ఈ ఒప్పందం అమలు కావాలి. చివరి క్షణంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. కాల్పుల విరమణకు, బందీల విడుదలకు తగిన సానుకూల పరిస్థితులను సృష్టించే పనిలో మధ్యవర్తులు నిమగ్నమయ్యారని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్–అన్సారీ వివరించారు. ఈ కార్యాచరణ దాదాపు పూర్తయినట్లు తెలిపారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఒప్పందం కుదిర్చే విషయంలో ఖతార్ అత్యంత కీలకంగా వ్యవహరించింది.
గాజాలో హమాస్ చెరలో ఉన్న తమ ఆప్తుల విడుదల కోసం బందీల కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమ దేశంలోని జైళ్ల నుంచి విడుదల కావడానికి అర్హతలు కలిగిన 300 మంది పాలస్తీనా ఖైదీల జాబితాను ఇజ్రాయెల్ న్యాయ శాఖ బహిర్గతం చేసింది. వీరిలో చాలామంది యువకులే ఉన్నారు. గత ఏడాది కాలంలో వీరంతా అరెస్టయ్యారు. రాళ్లు విసరడం, చిన్నచిన్న నేరాలకు పాల్పడడం వంటి కారణాలతో ఇజ్రాయెల్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 50 మంది బందీలను హమాస్ విడుదల చేస్తే, ఒప్పందం ప్రకారం 150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి ఉంటుంది.
అల్–షిఫా డైరెక్టర్, డాక్టర్ల అరెస్టు
గాజాలోని అల్–షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ అబూ సాల్మియాతోపాటు ఇద్దరు సీనియర్ డాక్టర్లను ఇజ్రాయెల్ సైన్యం అరెస్టు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన వాహనాల్లో రోగులతోపాటు ప్రయాణిస్తుండగా సైన్యం వారిని అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అల్–షిఫా హాస్పిటల్ డైరెక్టర్, వైద్యులను ఇజ్రాయెల్ సైన్యం అరెస్టు చేయడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
అల్–షిఫా కింద హమాస్ సొరంగం, బంకర్లు
గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా హాస్పిటల్ కింది భాగంలో భారీ సొరంగంలో హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని ఇజ్రాయెల్ సైన్యం పదేపదే చెబుతోంది. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాన్ని సైన్యం తాజాగా బయటపెట్టింది. విదేశీ జర్నలిస్టుల బృందాన్ని హమాస్ సొరంగంలోకి తీసుకెళ్లి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూపించింది. రాళ్లతో నిర్మించిన ఈ సొరంగం 150 మీటర్ల పొడవు ఉంది. అల్–షిఫా కింద అండర్‌గ్రౌండ్ బంకర్లను కలుపుతూ దీన్ని నిర్మించారు. సొరంగం చివర వసతి గృహం లాంటిది కనిపిస్తోంది. ఏసీ, వంటగది, బాత్‌రూమ్, రెండు ఇనుప మంచాలు ఉన్నాయి. గచ్చుపై తెల్లటి టైల్స్ పరిచారు.
ఈ టన్నెల్ చాలా రోజులు ఉపయోగంలో లేనట్లు దుమ్ముధూళితో నిండిపోయి ఉంది. అల్–షిఫా కిందనున్న హమాస్ సొరంగం దృశ్యాలను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. గాజాలోని ఆసుపత్రులను హమాస్ మిలిటెంట్లు ప్రధాన స్థావరాలుగా మార్చుకున్నారని, వాటి కింది భాగంలో సొరంగాలు, బంకర్లు నిర్మించుకున్నారని, ఆయుధాలు నిల్వ చేశారని, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆసుపత్రులపై గురిపెట్టి వైమానిక దాడులు కొనసాగిస్తోంది. అయితే, ఇజ్రాయెల్ ఆరోపణలను హమాస్ ఖండిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment