ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలపై నేరుగా ప్రసంగించిన హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాపై ఇజ్రాయెల్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పిరికిపందలా బంకర్‌లో దాక్కుని.. సుదీర్ఘమైన నిస్సారమైన ప్రసంగాన్ని ప్రపంచానికి అందించారంటూ ఎద్దేవా చేసింది.
‘‘హసన్ నజ్రల్లా సుదీర్ఘమైన ప్రసంగం మేం విన్నాం. అది ఏమాత్రం ఆసక్తిగా లేదని నేను భావిస్తున్నా. ఆయనకు ప్రసంగాలు రాసే మనిషి.. బహుశా ఉత్తరాన ఇజ్రాయెల్ రక్షణ బలగాలు జరిపిన దాడుల్లో మరణించి ఉన్నాడని భావిస్తున్నా. ప్రాణభయంతో ఒక పిరికిపందలా నస్రల్లా బంకర్‌లో దాక్కుని ప్రసంగించారు. పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే హమాస్‌ను సమర్థిస్తూ సుమారు గంటసేపు ప్రసంగించారాయన. ఆ స్థానంలో నేను ఉంటే.. అసలు నా ముఖం జనాలకు చూపించేవాడినే కాదు’’ అని ప్రభుత్వ ప్రతినిధి ఎయిలోన్ లెవీ మీడియాతో చెప్పారు.
ఇదిలా ఉంటే.. శుక్రవారం వర్చువల్ ప్రసంగించిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా.. యుద్ధ ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ, ఆయన కేవలం హమాస్ దాడుల్ని ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్, అగ్రరాజ్యం అమెరికాను ప్రశ్నించారంతే. గొప్పగా గోప్యతను పాటించి.. పక్కా ప్రణాళికతో అక్టోబర్ 7వ తేదీ నాటి ఇజ్రాయెల్ దాడుల్ని సమర్థవంతంగా నిర్వహించిందంటూ హమాస్‌ను అభినందించారు. ఇజ్రాయెల్ సైనిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో ఈ దాడులతో స్పష్టమైందని అన్నారాయన. అలాగే.. ఆ దాడుల్లో హిజ్బుల్లా ప్రమేయం లేదని కూడా తేల్చి చెప్పారు.
మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో 9,000 మందికిపైగా మరణించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నస్రల్లా.. గాజా దాడుల్లో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న అమెరికాపైనా మండిపడ్డారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా చేస్తున్న హెచ్చరికలను తాము పట్టించుకోబోమని నస్రల్లా తెగేసిచెప్పారు.
‘‘అమెరికా నౌకలు మధ్యదరా సముద్రంలో ఉన్నాయి. అయినా భయపడం. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాం. మేం ఇప్పటికే పాలస్తీనా కోసం యుద్ధం చేస్తున్నాం. అది మరింతగా విస్తరించొచ్చు. హమాస్‌కు అండగా ఉంటాం. గాజాపై దాడులను మీరు(అమెరికా) ఆపగలరు. ప్రాంతీయ యుద్ధం తలెత్తకుండా ఉండాలని భావిస్తున్న వారు ఎవరైనా సరే.. ముందుగా ఇజ్రాయెల్‌ను నిరోధించాలి’’ అని ఆయన అమెరికాకు సూచించారు. టెలివిజన్ ద్వారా నస్రల్లా చేసిన ఈ ప్రసంగాన్ని అరబ్బుదేశాల్లోని లక్షలమంది వీక్షించారు.
లెబనాన్‌లోని పాలస్తీనా గ్రూప్‌లతో కూటమిగా ఉన్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ గత కొంతకాలంగా టార్గెట్ చేసి దాడులు చేస్తోంది. పైగా హిజ్బుల్లా ఉద్యమానికి ఇరాన్ మద్దతు కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment