ఇజ్రాయెల్ దాడితో మంటల్లో చిక్కుకున్న గాజా సిటీలోని అల్ అహ్లీ ఆస్పత్రి
ఖాన్ యూనిస్/వాషింగ్టన్: హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. ఆస్పత్రిపై దాడి చేసింది తమ బలగాలేనా కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
దాడిలో ఆస్పత్రి పరిసరాలు భీతావహంగా మారాయి. ఆస్పత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దాడి ఘటనపై పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. దాడికి ముందు ఆ ఆస్పత్రిలో మూడువేల మంది శరణార్థులు ఆశ్రయంపొందుతున్నట్లు తెలుస్తోంది.
ఉత్తర గాజాను ఖాళీ చేయాలని, తక్షణమే దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని పాలస్తీనియన్లను ఆదేశించిన ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం అదే దక్షిణ గాజాపై భీకర స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది. భారీగా రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో పదులు సంఖ్యలో జనం మరణించారు. దక్షిణ గాజాలోని రఫా, ఖాన్ యూనిస్ నగరాల్లో ఈ దాడులు జరిగాయి. పలు భవనాలు ధ్వంసమయ్యాయి.
రఫాలో 27 మంది, ఖాన్ యూనిస్‌లో 30 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ మాజీ మంత్రి బసీమ్ నయీం చెప్పారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఉత్తర గాజాపై భూతల దాడులకు సన్నాహాలు చేస్తూ, మరోవైపు దక్షిణ గాజాపై హఠాత్తుగా వైమానిక దాడులు చేయడం గమనార్హం. హమాస్ స్థావరాలను, మిలిటెంట్ల మౌలిక సదుపాయాలను, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడానికే దక్షిణ గాజాపై రాకెట్లు దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. హమాస్ కదలికలు ఎక్కడ కనిపించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇంకా శిథిలాల కిందే మృతదేహాలు
ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. ఇరుపక్షాల నడుమ పరస్పర దాడుల్లో ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్ల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు. మృతుల్లో మూడింట రెండొంతుల మంది చిన్నపిల్లలేనని గాజా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అబ్బాస్ తెలిపారు.
గాజాలో మరో 1,200 మంది భవనాల శిథిలాల కింద చిక్కుకొని, మృతి చెందినట్లు భావిస్తున్నామని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ మరణాలు అధికారిక గణాంకాల్లో చేరలేదు. విద్యుత్, పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో శిథిలాలను తొలగించడం సాధ్యం కావడం లేదు. ఇజ్రాయెల్ దళాలు భీకర స్థాయిలో దాడులు చేస్తున్నా హమాస్ మిలిటెంట్లు వెనక్కి తగ్గడం లేదు. గాజా నుంచి ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్లు ప్రయోగిస్తూనే ఉన్నారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ వెల్లడించారు. ఉన్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తమ పదాతి దళాలు అడుగు ముందుకేస్తాయని, తమ సైన్యం గాజా సరిహద్దుల్లో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఉత్తర గాజా సగం ఖాళీ!
ఉత్తర గాజా నుంచి జనం తరలింపు కొనసాగుతోంది. దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. ఉత్తర గాజా సగానికి పైగా ఖాళీ అయినట్లు సమాచారం. ఆసుపత్రుల్లోని వేలాది మంది రోగులు, క్షతగాత్రులు ఇంకా అక్కడే ఉన్నారు. ఆహారం, నీరు, ఔషధాలు పూర్తిగా నిండుకున్నాయని, బాధితుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పాలస్తీనియన్ల కోసం ఇతర దేశాలు పంపించిన ఆహారం, నిత్యావసరాలు వారికి అందడం లేదు. రఫా సరిహద్దును ఈజిప్టు మూసివేసింది. నిత్యావసరాలతో కూడిన వాహనాలు గాజాలో ప్రవేశించడానికి ప్రస్తుతం ఈ సరిహద్దు వద్ద వేచి ఉన్నాయి. ఈజిప్టు అనుమతిస్తేనే గాజా ప్రజలకు ఆహారం అందుతుంది. రఫా సరిహద్దును తెరిపించేందుకు కొందరు మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇజ్రాయెల్ మంగళవారం మూడు గంటలపాటు గాజాకు నీరు సరఫరా చేసింది. ఈ నీరు గాజాలో కేవలం 14 శాతం మందికి సరిపోతుంది.
గాజాపై దాడులు ఆపండి: ఖమేనీ
గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఖండించారు. దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ తీరు మార్చుకోకపోతే హింసాత్మక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ వైఖరి పట్ల ఇస్లామిక్ దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని స్పష్టం చేశారు.
రెచ్చిపోయిన లెబనాన్ హెజ్బొల్లా మిలిటెంట్లు
లెబనాన్–ఇజ్రాయెల్ సరిహద్దులో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం హెజ్బొల్లా మిలిటెంట్లు లెబనాన్ భూభాగం నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పైకి యాంటీ–ట్యాంక్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో ఇజ్రాయెల్‌లో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దు నుంచి పౌరులను ఖాళీ చేయించాలని ఆదేశించింది. తమ భూభాగంపై జరిగిన దాడికి ప్రతిస్పందనగా దక్షిణ లెబనాన్‌పై వైట్ ఫాస్పరస్ బాంబులను ప్రయోగించింది.
యుద్ధ ట్యాంకులతో బాంబుల వర్షం కురిపించింది. ఇంతలో లెబనాన్ వైపు నుంచి ఇజ్రాయెల్‌పై మరో రెండు యాంటీ–ట్యాంక్ క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్ దాడులు నిర్వహించింది. నలుగురు మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
గతవారం లెబనాన్‌లోని ఇస్లామిక్ జిహాద్ సభ్యులు ఇజ్రాయెల్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా మిలిటెంట్లు, ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌తో ఘర్షణకు దిగుతున్నారు. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఘర్షణలు మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హెజ్బొల్లాకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం ఇతర దేశాలకు విస్తరించకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తుర్కియే విదేశాంగ మంత్రి హక్కన్ ఫిదాన్ చెప్పారు.
నేడు ఇజ్రాయెల్‌లో జో బైడెన్ పర్యటన
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. హమాస్ దాడులను ఖండించిన ఆయన ఇప్పటికే ఇజ్రాయెల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యూదులకు సంఘీభావం తెలియజేస్తూ ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్నానని బైడెన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జోర్డాన్‌లోనూ పర్యటిస్తానని, ఇస్లామిక్ దేశాల అధినేతలతో భేటీ అవుతానని, గాజాలో తాజా పరిణామాలు, పాలస్తీనియన్లకు అందించాల్సిన మానవతా సాయంపై చర్చిస్తానని వెల్లడించారు. పాలస్తీనియన్లకు హమాస్ ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. గాజా ప్రజలకు మానవతా సాయం అందించడానికి వీలుగా ఒక ప్రణాళిక రూపొందించాలని అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయించాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం చెప్పారు.
హమాస్ టాప్ కమాండర్ హతం
సెంట్రల్ గాజాలోని బురీజ్ శరణార్థుల శిబిరంపై జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అగ్రశ్రేణి కమాండర్ అయమాన్ నొఫాల్ హతమయ్యాడు. ఈ విషయాన్ని హమాస్ మిలటరీ విభాగం స్వయంగా వెల్లడించింది. నొఫాల్ సెంట్రల్ గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్ వ్యవహారాల ఇన్‌చార్జిగా పని చేస్తున్నాడు. ఇతర ఇస్లామిక్ దేశాల్లోని మిలిటెంట్ గ్రూప్‌లతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment