
19 మంది దుర్మరణం
డెయిర్ అల్ బలాహ్: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడుల పర్వం ఆగడం లేదు. దక్షిణ గాజాలో వలసదారులకు ఆశ్రయం కలి్పస్తున్న మానవతా జోన్‌పై ఇజ్రాయెల్ దళాలు సోమవారం జరిపిన దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారని పాలస్తీనా అధికారులు ప్రకటించారు. ఖాన్ యూనిస్ పరిధిలోని అల్–మవాసీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. అయితే 40 మంది చనిపోయినట్లు తొలుత వార్తలొచ్చాయి. మానవతా జోన్లలో రహస్యంగా పనిచేస్తున్న హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉగ్రవాదులపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
క్షిపణి దాడుల్లో 20 గుడారాలు దగ్ధమయ్యాయని, పేలుడు ధాటికి 30 అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయని గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్న గాజా సివిల్ డిఫెన్స్ సభ్యులు ఇసుకను తవ్వుతున్న దృశ్యాలను హమాస్ మీడియా సంస్థ అల్ అక్సా టీవీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘200 పై చిలుకు నిర్వాసితుల గుడారాల్లో 20 ధ్వంసమయ్యాయి. వాటిలో ఉంటున్న కుటుంబాలు అదృశ్యమయ్యాయి’’ అని గాజా సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి మహమూద్ బస్సాల్ చెప్పారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇప్పటికీ దాడులు ఆపడం లేదని శరణార్థులు వాపోయారు. దాడి జరిగిన చోట తమ వాళ్లెవరూ లేరని హమాస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment