
మానవత్వం మమ్మల్ని చర్య తీసుకోవడానికి బలవంతం చేస్తోంది...
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం కారణంతో గాజాలో తీవ్ర ఆహార కోరత ఏర్పడింది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందిస్తూ.. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చింది. పాలస్తీనాలోని ప్రజలు అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. మానవతా సాయం పెంచాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు.
అలబామాలోని సెల్మాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమలా హారిస్.. ‘గాజాలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడి పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయి. మానవత్వం మమ్మల్ని చర్య తీసుకోవడానికి బలవంతం చేస్తోంది. గాజాలోని ప్రజలకు సహయం పెంచడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కృషి చేయాలి’ అని కమలా హారిస్ అన్నారు.
‘హమాస్ కాల్పుల విరమణను కోరుకుంటుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ ఒప్పుకోవడానికి సిద్ధం ఉంది. కాల్పుల విరమణ డీల్ చేసుకోండి. బంధీలను వారి కుటుంబాలకు వద్దకు చేర్చండి. అదేవిధంగా వెంటనే గాజా ప్రజలకు కూడా శాంతి, సాయం అందించండి’ అని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు.
ఇక.. తమ వద్ద సజీవంగా ఉన్న ఇజ్రాయెల్ బంధీల పేర్లు వెల్లడించడానికి హమాస్ తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ స్థానిక మీడియా పేర్కొంటోంది. ఆదివారం కైరోలో జరిగిన గాజా కాల్పుల విరమణ చర్చలను ఇజ్రాయెల్ బాయ్‌కాట్ చేయటం గమనార్హం.