
నివాసాలపై దాడుల్లో 110 మంది మృతి
డెయిర్ అల్–బలాహ్: గాజాలోని పాలస్తీనియన్లకు బుధవారం రాత్రి కాళరాత్రే అయ్యింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ మరోమారు వైమానిక దాడులకు పాల్పడింది. దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా కనీసం 110 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గాయాలపాలయ్యారు. సరిహద్దులకు సమీపంలోని ఖాన్‌యూనిస్ నగర వెలుపల అబసన్ అల్– కబీర్ గ్రామంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 16 మంది చనిపోయినట్లు అక్కడున్న యూరోపియన్ ఆస్పత్రి తెలిపింది.
మృతుల్లో తండ్రి, అతడి ఏడుగురు కుమారులు ఉన్నారు. వీరితోపాటు దంపతులు, వారి కుమారుడు చనిపోగా నెలల చిన్నారి, ఇద్దరు వృద్ధ దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. సరిహద్దులకు సమీపంలోని బెయిట్ లహియాపై జరిగిన మరో దాడిలో 19 మంది మృత్యువాతపడ్డారని ఇండోనేసియన్ ఆస్పత్రి వివరించింది. ఇప్పటికే తీవ్రంగా ధ్వంసమైన బెయిట్ లహియాలో తాజా దాడితో పరిస్థితులు మరింత భీతావహంగా మారాయని ఆరోగ్య విభాగం తెలిపింది.
రఫాలో 36 మంది చనిపోయినట్లు అక్కడి యూరోపియన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, ఖాన్ యూనిస్‌లో ఏడుగురు మృతి చెందినట్లు నాసర్ ఆస్పత్రి తెలిపింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నామని ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికులు తెలిపారు.
మృతుల్లో 200 మంది చిన్నారులు..
కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత మొదటిసారిగా ఇజ్రాయెల్ మంగళవారం ఉదయం గాజాపై జరిపిన దాడుల్లో కనీసం 400 మంది చనిపోవడం తెలిసిందే. మంగళవారం నుంచి గురువారం వరకు జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో 200 మంది చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. మరో 909 మంది క్షతగాత్రులుగా మారారని పేర్కొంది. కాగా, మిలిటెంట్లే లక్ష్యంగా తాము దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించుకుంది.
డజన్ల కొద్దీ లక్ష్యాలపై జరిగిన ఈ దాడుల్లో మిలిటెంట్లతో పాటు వారి సైనిక వసతులు దెబ్బతిన్నాయని తెలిపింది. గురువారం ఉదయం యెమెన్‌లోని ఇరాన్ అనుకూల హౌతీ రెబల్స్ ప్రయోగించిన క్షిపణిని గగనతలంలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. ఆ క్షిపణిని కూల్చి వేశామని, ఎవరికీ ఎటువంటి గాయా లు కాలేదని తెలిపింది. అదే విధంగా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా టెల్ అవీవ్‌పైకి తాము రా కెట్లను ప్రయోగించినట్లు హమాస్ తెలిపింది. దీంతో, బెన్ గురియె న్ విమానాశ్రయంలో రాకపో కలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రయాణికుల విమానాలను దారి మళ్లించారు.
దిగ్బంధంలో ఉత్తర గాజా
గాజా నగరం సహా ఉత్తర గాజా ప్రాంతాన్ని బుధవారం తిరిగి ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధించింది. సుమారు ఐదు మైళ్ల పొడవైన నెట్‌జరిమ్ కారిడార్‌ను స్వాధీనం చేసుకుంది. ఉత్తర గాజా ప్రాంతాన్ని విడిచి వెళ్లరాదని, ప్రధాన రహదారిపైకి రావద్దని పాలస్తీనా వాసులకు ఆర్మీ హెచ్చరికలు చేసింది. దక్షిణ ప్రాంతానికి వెళ్లే వారు తీరం వెంబడి ఉన్న రహదారిని మాత్రమే వాడుకోవాలని స్పష్టం చేసింది.
బెయిట్ లహియా పట్టణంలోకి అదనంగా బలగాలను పంపిస్తున్నట్లు తెలిపింది. తమ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించనందునే పోరాటం మళ్లీ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇప్పటికే గాజా ప్రాంతంలోని 20 లక్షల మంది పాలస్తీనియన్లకు ఆహారం, ఇంధనం, ఇతర మానవీయ సాయాన్ని నిలిపివేసిన ఇజ్రాయెల్..మిగతా 59 మంది బందీలను హమాస్ విడుదల చేసేదాకా దాడులను తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది.
ఆయుధాలు వీడే ప్రసక్తే లేదు: హమాస్
శాశ్వత కాల్పుల విరమణతో పాటు ఇజ్రాయెల్ ఆర్మీని గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటేనే మిగతా బందీలను విడిచిపెడతామని హమాస్ స్పష్టం చేసింది. గాజాలో ఇజ్రాయెల్ ఉనికిని తాము అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తిగా వైదొలిగాకే పశ్చిమ దేశాల మద్దతున్న పాలస్తీనా అథారిటీకి లేదా స్వతంత్ర రాజకీయ నేతల కమిటీకి అధికారం బదిలీ చేస్తామని తేల్చి చెప్పింది. అప్పటి వరకు ఆయుధాలను వీడబోమని తెలిపింది.
నెతన్యాహూ నివాసం వద్ద ఉద్రిక్తత
బందీల విడుదల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వందలాది మంది పశ్చిమ జెరూసలేంలోని ప్రధాని నెతన్యాహూ నివాసాన్ని చుట్టుముట్టారు. బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. గాజాపై మళ్లీ దాడులు ప్రారంభిస్తే హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ సంబంధీకుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment