
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శుక్రవారం ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్–థానీతో శుక్రవారం సమావేశమయ్యారు. ఖతార్ రాజధాని దోహాలో ఈ భేటీ జరిగింది. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలు, తాజా పరిణామాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ విషయాన్ని జైశంకర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. నాలుగు రోజుల అమెరికా పర్యటనను ముగించుకొని భారత్‌కు తిరుగు ప్రయాణమైన ఆయన ఖతార్‌లో ఆగారు.
కాబూల్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానం
అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత అక్కడే చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి తీసుకురావడమే లక్ష్యంగా భారత వాయు సేనకు చెందిన సీ–17 విమానం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. కాబూల్‌కు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా మారిన వెంటనే అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. సీ–17 ద్వారా 250 మంది భారతీయులను వెనక్కు తీసుకురావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద 400 మంది భారతీయులు అక్కడ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment