ఈ ఫొటోలో శునకం దర్జాగా కూర్చున్న డెన్ బాగుంది కదా! డెన్‌లో కుక్క కూర్చుని ఉంది. అందులో దర్జా ఏముందని తీసి పారేయకండి. ఎందుకంటే రాజభవనాన్ని పోలి ఉన్న ఆ డెన్ (ఇన్యుడెన్)ఖరీదు అక్షరాలా... కోటి 17 లక్షల 60 వేల రూపాయలు. సాధారణ ఇళ్ల ఖరీదు కంటే కూడా ఎక్కువ. దీనిని నిర్మించింది... జపాన్‌లోని ఒసాకాకు చెందిన కల్చరల్ ప్రాపర్టీ స్ట్రక్చరల్ ప్లాన్ కార్పొరేషన్ లిమిటెడ్.
వారసత్వ కట్టడాలను పునరుద్ధరించడం ఈ కంపెనీ ప్రత్యేకత. ఇందులోని ఉద్యోగులు శతాబ్దాల కిందటి గుళ్లు, గోపురాల నిర్మాణంలో నిపుణులు. ఆ కంపెనీ ఇటీవలే ఈ ఇన్యుడెన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. జపనీస్ గుళ్లు, గోపురాల పురాతన రీతులను ఉపయోగించి సహజసిద్ధమైన మెటీరియల్స్‌తో, అత్యంత నాణ్యతతో వీటిని నిర్మిస్తామని ప్రకటించింది.
అందులో ఏమైనా సౌకర్యాలుంటాయా? అంటే అదీ లేదు. కేవలం అది జపాన్‌కు చెందిన రాజభవనాల రిప్లికా మాత్రమే. దీనికెందుకంత ధర అంటే... అది గ్రానైట్ రాయిపై ప్రత్యేక కలపను ఉపయోగించి, ఎలాంటి మెషీన్లను వాడకుండా పూర్తిగా చేతులతో రూపొందించిన భవనం. దాని స్పెషాలిటీ అంతా అందమైన పైకప్పులో ఉంది. డెన్ నిర్మాణం కోసం సెప్టెంబర్ నుంచి ఆర్డర్లు తీసుకోనుందీ కంపెనీ. ఎక్కువ ఆర్డర్లు వస్తే... లాటరీ తీసి మరీ ఎంపిక చేస్తారు. ఎందుకంటే అది ఏడాదికి ఒక్క ఇంటిని మాత్రమే తయారు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment