టోక్యో: జపాన్ యువరాణి మాకో తన చిరకాల ప్రేమికుడు కీయ్ కౌమురోను పెళ్లి చేసుకోబోతోంది. తన ప్రేమ కోసం తన వారసత్వ సంపదగా వచ్చే పెద్ద మొత్తాన్ని వదులు కోవడానికి సిద్ధపడి వార్తల్లో నిలిచిన మాకో ఎట్టకేలకు తన ప్రియుడిని మనువాడేందుకు సిద్ధమైంది. మాజీ కాలేజీ క్లాస్‌మేట్‌ను అక్టోబర్ 26 న వివాహం చేసుకోనుంది.
పలు విమర్శలు, నిశిత పరిశీలన తర్వాత జపాన్ రాజకుటుంబ వ్యవహారాలు చూసే ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అయితే యువరాణి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతోందని, దాన్నుంచి కోలుకునేందుకు ఇంత సమయం పట్టిందని కూడా ప్రకటించింది. సంప్రదాయ వివాహం అనంతరం ఆమె రాజ కుటుంబాన్ని విడిచిపెడుతుందనీ, సాధారణ రాజ వివాహానికి సంబంధించిన వేడుకలేవీ జరగవని స్పష్టం చేసింది. జపనీస్ రాయల్ వెడ్డింగ్‌తో పాటు జరిగే అన్ని ఆచారాలకు విరుద్ధంగా ఈ వివాహం ఉంటుందని తెలిపింది.
చక్రవర్తి అఖిహిటో ముని మనవరాలు, నరుహిటో మేనకోడలైన మాకో, కౌమురో ఎంగేజ్మెంట్ 2017లోనే జరిగింది. కానీ కౌమురో తల్లికి, ఆమె మాజీ ప్రియుడి మధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా 2018లో జరగాల్సిన వీరి పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది. వీరి ప్రేమ వార్త జపాన్ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద చర్చకుదారి తీసింది. ఈ జంట తమ వివాహాన్ని స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేసుకుంటారని యువరాణి 110 మిలియన్ జపనీస్ యెన్స్ లేదా 1.4 మిలియన్ డాలర్లను వదులుకుందని అధికారిక ప్రకటన తెలిపినట్టు స్థానికమీడియా నివేదించింది. యువరాణి.. సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వారికి రాయల్టీ కింద కొంత సొమ్మును ముట్టజెబుతారు. కానీ ప్రిన్సెస్ మాకో 1.4 మిలియన్ డాలర్లను రిజెక్ట్ చేసి మరీ పెళ్లి సిద్ధంగావడం విశేషంగా నిలిచింది. అలాగే కౌమురోతో పెళ్లి అనంతరం జపాన్ రాజకుటుంబ వారసత్వాన్ని కూడా ప్రిన్సెస్ మాకో కోల్పోనుంది.
కియో కౌమురో పోనీటైల్‌తో దర్శనమిచ్చి మీడియాను ఆకర్షించాడు. కౌమురో ఈ సంవత్సరం ఫోర్డ్‌హామ్ లా స్కూల్లో చదువు పూర్తి చేయడంతోపాటు, లా ప్రాక్టీస్ కోసం బార్ ఎగ్జామ్ పూర్తి చేశాడు. తాజా మీడియా నివేదికల ప్రకారం, అతను అమెరికాలో ఒక లా ఆఫీసులో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఈ నేపథ్యంలో తన ప్రియుడు కౌమురోను పెళ్లి చేసుకొని అమెరికాకు షిఫ్ట్ కానుంది మాకో. కాగా డైలీ మైనీచి ఇటీవల నిర్వహించిన పోల్‌లో 38 శాతం మంది వీరి వివాహానికి మద్దతునివ్వగా, 35 శాతం మంది వ్యతిరేకించారు. 26 శాతం తటస్థంగా ఉండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment