
కొమురొ, మాకో
ప్రేమ దేశం యువరాణి
పూతప్రాయం విరబోణి
ఏరికోరి మెచ్చావే
ఈ తోట రాముణ్ణి
అని అంటూ సినిమాల్లోనే కోటలో రాజకుమారి తోటలో సామాన్యుడిని పెళ్లి చేసుకోవడం చూశాం. కానీ ఇక్కడ నిజజీవితంలో జపాన్ యువరాణి మాకో తాను ప్రేమించినవాడితో జీవితాన్ని పంచుకోవడం కోసం అన్నీ వదులుకొని సామాన్యురాలిగా మారిపోయింది. డబ్బుని, విలాసవంతమైన జీవితాన్ని, రాచరిక హోదాని వదులుకొని అత్యంత నిరాడంబరంగా ప్రేమికుడు కీశాన్ కొమురొని పెళ్లాడింది. వారిద్దరి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని రాజభవనం అధికారులు మంగళవారం అధికారికంగా విడుదల చేశారు.
రాజభరణాన్ని తిరస్కరించి..
జపాన్ రాచరిక చట్టాల ప్రకారం అమ్మాయిలు సామాన్యుల్ని పెళ్లి చేసుకుంటే రాణీవాసాన్ని, రాజభోగాల్ని వదులుకోవాలి. అందు కోసం రాజభరణం కింద 14 కోట్ల యెన్‌లు (దాదాపుగా రూ 9.30 కోట్లు) చెల్లిస్తారు. కానీ మాకో తమ ప్రేమ ముందు అన్నీ తృణప్రాయంగా భావించింది. రాజభరణాన్ని తిరస్కరించి కట్టుబట్టలతో రాజప్రసాదాన్ని వీడింది.
రెండో ప్రపంచయుద్ధం తర్వాత రాజభరణాన్ని వద్దనుకొని సామాన్యుడి వెంట అడుగులు వేసిన యువరాణి మాకో ఒక్కరే. కొమురొ, మాకో జంట అమెరికాలోని న్యూయార్క్‌లో తమ భావి జీవితాన్ని గడపనున్నారు. న్యూయార్క్‌లో కొమురొ లాయర్ వృత్తిలో ఉన్నారు. వీరిద్దరినీ ఇప్పుడు బ్రిటన్ రాచరిక జంట ప్రిన్స్ హ్యారీ, మేఘాన్ మార్కెల్‌లతో పోలుస్తున్నారు.
అతనో పెన్నిధి
దేశం విడిచి వెళ్లే ముందు కొత్త జంట మీడియాతో మాట్లాడారు. కొమురొ వెలకట్టలేని ఒక పెన్నిధి అని, తమ మనసులు మరింతగా పెనవేసుకొని జీవితాంతం ఆనందంగా గడపడానికే ఈ పెళ్లిచేసుకున్నామని మాకో చెప్పారు. మరోవైపు కొమురొ కూడా మాకోపై అంతే ప్రేమను కురిపించారు. ‘‘మాకోని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఈ జీవితం ఒక్కటే. ఇది ఆమె ప్రేమలోనే గడిపేస్తాను’’అని భావోద్వేగంతో చెప్పారు. కష్టమైనా, సుఖమైనా కలిసి పంచుకుంటూ, ఒకరికొకరు తోడు నీడగా ఉంటామన్నారు.
– టోక్యో
ఆది నుంచి వివాదాలే
కోటలో యువరాణి మనసిచ్చిన సామాన్యుడ్ని మనువాడడం అంత సులభం కాదు. వీరి జీవితంలోనూ సినిమాల్లో చూపించే మలుపులు, వివాదాలు ఎన్నో ముసురుకున్నాయి. జపాన్ చక్రవర్తి నరుహితోకు మేనకోడలైన మాకో , టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కొమురొ క్లాస్‌మేట్. అలా వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. 2017 సెప్టెంబర్‌లోనే వారిద్దరూ తాము ప్రేమలో ఉన్నామని ప్రకటించారు.
ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. అయితే కొమురొ తల్లితో వచ్చిన ఒక ఆర్థికపరమైన వివాదం కారణంగా అప్పట్లో వారి వివాహం ఆగిపోయింది. కొమురొ తల్లి ఆమె మాజీ ప్రియుడి నుంచి డబ్బులు తీసుకొని ఎగవేశారన్న ఆరోపణలున్నాయి. కొమురొ, మాకో పెళ్లికి ఆ ఆరోపణలతో సంబంధం లేదని రాజకుటుంబం అప్పట్లోనే ప్రకటించింది. అప్పట్నుంచి మీడియాలో వారిద్దరి ప్రేమపై లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి.
కొమురొ యువరాణికి తగిన జోడీ కాదని మీడియాలో హోరెత్తిపోయింది. ప్రజలు కూడా యువరాణి ప్రేమని మెచ్చలేదు. ఆ స్థాయిలో వ్యతిరేకతను తట్టుకోలేక మాకో మానసికంగా కుంగిపోయింది. ఆ డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి ఆమెకు మూడేళ్లు పట్టింది. ఎన్నో వివాదాలు, వ్యతిరేకతల్ని ఎదుర్కొని సంపదని, రాజభోగాల్ని వదులుకొన్న యువరాణి మాకో రియల్ హీరోయిన్ అనిపించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment