![Joe Biden intends to seek a second term as US president - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/1/biden.jpg.webp?itok=FP9R4Qw8)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆ పదవికి పోటీపడనున్నారు. ఆయన భార్య జిల్ బైడెన్ సీఎన్‌ఎన్ వార్తా సంస్థకు ఈ మేరకు తెలిపారు. 80 ఏళ్ల బైడెన్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుల్లో అత్యంత వయోధికునిగా రికార్డు సృష్టించారు. రెండేళ్లలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలో దిగే ఆలోచన ఉందని ఆయన కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పారు. సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ జిల్ ఇదే విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నట్టు తెలిపారు.
రెండోసారి పోటీపై బైడెన్ బహుశా మరో రెండు మూడు నెలల్లో అధికారిక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అయితే డెమొక్రటిక్ పార్టీ సహచరుల్లో ప్రధానంగా ఆయన వయసుపైనే అభ్యంతరాలు నెలకొన్నాయి. దీనిపై రాయిటర్స్–ఇప్సోస్ తాజాగా నిర్వహించిన పోల్‌లో బైడెన్ పోటీ చేయొద్దని డెమొక్రాట్లలో ఏకంగా 52 శాతం మంది అభిప్రాయపడ్డారు! మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి అధ్యక్ష బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ప్రస్తుతం 76 ఏళ్లు! పైగా పార్టీ అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ తదితరులు ఇప్పటికే ఆయనకు పోటీదారులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment