బుచా సిటీలో రష్యా సైనికులు ఖననం చేసిన మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యం (ఇన్‌సెట్‌లో బైడెన్)
డెస్ మొయినెస్ (అయోవా, అమెరికా)/కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా అకృత్యాలు ముమ్మాటికీ నరమేధమేనంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్‌ను సమూలంగా తుడిచిపెట్టేందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక దేశాన్ని గానీ జాతిని గానీ మతపరమైన సమూహాన్ని గానీ పూర్తిగా గానీ పాక్షికంగా గానీ ధ్వంసం చేయడాన్ని, అందుకు ప్రయత్నించడాన్ని నరమేధంగా ఐరాస ఒప్పందం నిర్వచిస్తోంది.
సదరు ఒప్పందంలో అమెరికా కూడా భాగస్వామి. ఈ నేపథ్యంలో ఆ పదాన్ని వాడితే దాన్ని అడ్డుకోవడానికి అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే అమెరికా అధ్యక్షులెవరూ ఆ సాహసం చేయరు. 1990ల్లో రువాండాలో ఏకంగా 8 లక్షల మందిని పొట్టన పెట్టుకున్న జాతుల ఘర్షణను కూడా నరమేధంగా పేర్కొనేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వెనకాడారు. బైడెన్ మాత్రం ఎవరేమనుకున్నా ఉక్రెయిన్లో రష్యా దారుణాలు తనకు నరమేధంగానే కన్పిస్తున్నాయన్నారు. అవునో కాదో అంతర్జాతీయ న్యాయ నిపుణులు నిర్ణయించాలన్నారు. బైడెన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వాగతించారు.
నిజమైన నాయకుని నోట వచ్చిన సిసలైన మాటలంటూ ట్వీట్ చేశారు. రష్యా చర్యలను నరమేధంగా కాక యుద్ధనేరాలుగా పరిగణిస్తున్నామని గత వారమే బైడెన్ చెప్పడం తెలిసిందే. నరమేధం వంటి పదాలు వాడి ఉద్రిక్తతను పెంచడం ఎవరికీ మంచిది కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. రష్యా సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడినట్టు ఇప్పటికే రుజువైందని చెప్పారు. రష్యా దాడిని యూరప్ చరిత్రలోనే పెద్ద మలుపుగా బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డి క్రూ అభివర్ణించారు. యూరప్ తీరుతెన్నులను అది శాశ్వతంగా మార్చేసిందన్నారు.
కొనసాగుతున్న బాంబుల వర్షం
ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబుల వర్షం కొనసాగుతూనే ఉంది. ఖర్కీవ్‌లో ఓ కలినరీ స్కూల్‌పై భారీ దాడి జరిగింది. దాడిలో స్కూలుతో పాటు పరిసర భవనాలు కూడా భారీగా దెబ్బ తిన్నాయి. మారియుపోల్‌లో 36వ మరీన్ బ్రిగేడ్‌కు చెందిన 1,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు తమకు లొంగిపోయినట్టు రష్యా పేర్కొంది. బుచాలో 700 మందికి పైగా మరణించారని, 200 మంది దాకా ఆచూకీ లేకుండా పోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇప్పటిదాకా 403 మృతదేహాలను ఖననం చేసినట్టు చెప్పింది.
పరారీలో ఉన్న రష్యా అనుకూల ఉక్రెయిన్ కుబేరుడు విక్టర్ మెద్వెద్‌చుక్‌ను అదుపులోకి తీసుకున్నట్టు జెలెన్‌స్కీ ప్రకటించారు. రష్యా జైళ్లలో ఉన్న ఉక్రేనియన్లను విడుదల చేస్తే విక్టర్‌ను వారికి అప్పగిస్తామని చెప్పారు. రష్యా మున్ముందు మళ్లీ బలోపేతం కాకుండా మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్‌కు మరో 80 కోట్ల డాలర్ల మేర సాయుధ, ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు సమాచారం.
రసాయన దాడి నిజమే అయితే సహించేది లేదని అమెరికా కాంగ్రెస్ సభ్యులన్నారు. ఈ వార్తలపై అంతర్జాతీయ రసాయన ఆయుధాల నిషేధ సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌సైనికులకు డ్రోన్ల వాడకంపై శిక్షణ ఇచ్చేందుకు లాత్వియా ముందుకొచ్చింది. యూరప్‌లో యుద్ధం చెలరేగుతుందని ఏడాది కింద కూడా తానూహించలేదని పోప్ ఆవేదన వెలిబుచ్చారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఓ ఇటలీ పత్రికకు రాసిన వ్యాసంలో మరోసారి సూచించారు.
రష్యా సెల్ఫ్ గోల్!
ఉక్రెయిన్‌పై యుద్ధానికి బయల్దేరిన నాటి నుంచీ రష్యా సైన్యం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ చాలవన్నట్టు, పొరపాటున సొంత ట్యాంకులపై, సైనికులపై రష్యా దళాలు కాల్పులు జరిపినట్టు తాజాగా బయట పడింది. మార్చి 31న కీవ్ సమీపంలోని రష్యా కాన్వాయ్‌లో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. రష్యా చిహ్నమైన ‘వి’ గుర్తు ఉన్న యుద్ధ ట్యాంకు తన ముందున్న మరో ‘వి’ ట్యాంకుపై బాంబుల వర్షం కురిపించి దాన్ని ధ్వంసం చేసింది. దాంతోపాటు ముందు వరుసలో నడుస్తున్న సైనికులపై కూడా గుళ్ల వర్షం కురిపించింది. దీన్నంతటినీ ఉక్రెయిన్ నిఘా డ్రోన్లు షూట్ చేశాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇది బహుశా ఫ్రెండ్లీ ఫైరింగ్ అయ్యుంటుందని ఉక్రెయిన్ చెప్తోంది. సొంత బలగాలపైనే పొరపాటున కాల్పులు జరపడాన్ని సైనిక పరిభాషలో ఇలా పేర్కొంటారు.
కీవ్‌లో పలు దేశాధ్యక్షులు
ఉక్రెయిన్‌కు సంఘీభావంగా పోలండ్, లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా అధ్యక్షులు ఆంద్రే డూడ, గిటనస్ నౌసెడా, ఎగిల్స్ లెవిట్స్, అలార్ కలిస్ బుధవారం ఆ దేశంలో పర్యటించారు. కీవ్‌లో వారంతా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. తానూ త్వరలో అక్కడ పర్యటించే యోచనలో ఉన్నట్టు జర్మనీ అధ్యక్షుడు కూడా చెప్పారు. ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ శనివారం ఆకస్మికంగా కీవ్ వెళ్లడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment