యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్‌కు భారీగా సాయం అందించాలనుకుంటోంది అగ్రరాజ్యం అమెరికా. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. సుమారు 33 బిలియన్ డాలర్ల సాయం ప్యాకేజీ రూపంలో అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ కోసం ఈ రేంజ్‌లో సాయం ప్రకటించడం ఇదే ప్రథమం.
గురువారం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారు. ఆర్థికంగానే కాదు ఆయుధాల విషయంలోనూ ఈ సాయం ఉపయోగపడుతుందని బైడెన్ భావిస్తున్నాడు. అంతేకాదు రష్యా ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లను సైతం లక్ష్యంగా చేసుకున్న చట్టాలకు సైతం ప్రతిపాదనలు చేశాడాయన.
ఈ చట్టాల ప్రకారం.. రష్యాపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఉన్నతవర్గాల వాళ్లకు దక్కే అన్ని సౌకర్యాలు, రాయితీలు రద్దు చేస్తారు. అంతేకాదు వాళ్లకు చెందిన విలువైన ఆస్తులను జప్తు చేయొచ్చు కూడా. అలా ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని.. యుద్ధంతో నాశనమైన ఉక్రెయిన్‌కు నష్టపరిహారంగా చెల్లించబోతున్నారు.
‘‘మేము రష్యాపై దాడి చేయడం లేదు. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తనను తాను రక్షించుకోవడానికి సహాయం మాత్రమే చేస్తున్నాం’’ అంటూ బైడెన్ పేర్కొనడం విశేషం. దశలవారీగా ఈ భారీ సాయం అందే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ ప్రతిపాదనలకు చట్ట సభ ఆమోదం అవసరం.
Comments
Please login to add a commentAdd a comment