
జెరూసలేం: జోర్డాన్ రాజు అబ్దుల్లా–2 సవతి సోదరుడు ప్రిన్స్ హమ్జా ఆదివారం ఒక కార్యక్రమంలో ప్రజలకు దర్శనమిచ్చారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నుతున్నాడన్న ఆరోపణలతో ఏప్రిల్ 3న ఆయనను గృహనిర్బంధంలోకి తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ప్రజలకు కనిపించడం ఇదే మొదటిసారి. కింగ్ అబ్దుల్లా–2, ప్రిన్స్ హమ్జా ఒకే వేదికను పంచుకోవడం గమనార్హం. అయితే, వారి మధ్య విభేదాలు సమసిపోయాయా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. రాజధాని అమన్ నగరంలో కింగ్ తలాల్ సమాధి వద్ద అబ్దుల్లా–2, ప్రిన్స్ హమ్జా, క్రౌన్ ప్రిన్స్ ముస్సేన్, ఇతర కుటుం సభ్యులు కలిసి ఉన్న ఒక ఫొటో, వీడియోను రాయల్ ప్యాలెస్ విడుదల చేసింది.