King Abdullah
-
ప్రజల ఎదుట ప్రిన్స్ హమ్జా ప్రత్యక్షం
జెరూసలేం: జోర్డాన్ రాజు అబ్దుల్లా–2 సవతి సోదరుడు ప్రిన్స్ హమ్జా ఆదివారం ఒక కార్యక్రమంలో ప్రజలకు దర్శనమిచ్చారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నుతున్నాడన్న ఆరోపణలతో ఏప్రిల్ 3న ఆయనను గృహనిర్బంధంలోకి తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ప్రజలకు కనిపించడం ఇదే మొదటిసారి. కింగ్ అబ్దుల్లా–2, ప్రిన్స్ హమ్జా ఒకే వేదికను పంచుకోవడం గమనార్హం. అయితే, వారి మధ్య విభేదాలు సమసిపోయాయా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. రాజధాని అమన్ నగరంలో కింగ్ తలాల్ సమాధి వద్ద అబ్దుల్లా–2, ప్రిన్స్ హమ్జా, క్రౌన్ ప్రిన్స్ ముస్సేన్, ఇతర కుటుం సభ్యులు కలిసి ఉన్న ఒక ఫొటో, వీడియోను రాయల్ ప్యాలెస్ విడుదల చేసింది. -
నిర్లవణీకరణకు కొత్త మార్గం!
సముద్రపు నీటిని పూర్తిస్థాయిలో మంచినీటిగా మార్చగలిగితే భూమ్మీద నీటి కొరతన్నది అస్సలు ఉండదు. అయితే వేర్వేరు కారణాల వల్ల పూర్తిస్థాయి నిర్లవణీకరణ అన్నది సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వినూత్న పరికరం అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని వాడుకుంటూ ఈ పరికరం సముద్రపు నీటిలోని లవణాలను తొలగించడం.. తద్వారా మంచినీటిని తయారు చేయడం విశేషం. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు ఎంత ఉత్పత్తి అవుతుందో అందుకు ఎన్నో రెట్లు ఎక్కువ వేడి కూడా పుడుతూంటుంది. ఈ వేడి కారణంగా కాలక్రమంలో సోలార్ ప్యానెల్స్ విద్యుదుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతూంటుంది కూడా. సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు సోలార్ ప్యానెల్స్ అడుగుభాగంలో పలు పొరలు ఏర్పాటు చేసి ఉపయోగించారు. గొట్టాలతో కూడిన ఈ పొరల గుండా ఉప్పునీరు ప్రయాణించినప్పుడు సోలార్ ప్యానెల్స్ తాలూకూ వేడి కారణంగా వేడిగా మారతాయి. ఇలా పుట్టిన ఆవిరి పలుచటి త్వచం ద్వారా ఇంకో పొరలోకి చేరుతుంది. అక్కడ ఘనీభవించి మంచినీరుగా మారుతుంది. ఈ ఏర్పాటు కారణంగా సోలార్ ప్యానెల్స్ చల్లగా ఉంటూ విద్యుదుత్పత్తిలో నష్టం జరగదని.. అదే సమయంలో ప్యానెల్స్‌ను శుభ్రం చేసుకునేందుకు లేదా పంటలు పండించుకునేందుకు అవసరమైన మంచినీరు అందుబాటులోకి వస్తుందని సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ప్రజల నిరసనలతో దిగొచ్చిన కింగ్
అమ్మాన్: దేశంలో ఇంధన, విద్యుత్ ధరలు పెంచుదాం అనుకున్న జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II కి ఊహించని షాక్ తగిలింది. ధరలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇంధన ధరల పెరుగుల నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని, అసమర్థ ప్రభుత్వం వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని దేశ ప్రజలు గతరెండు రోజులుగా దేశ వ్యాప్తంగా రోడ్లను స్తంభింపజేశారు. టైర్లు కాలపెడుతు రోడ్లను దిగ్బందం చేయడంతో ప్రభుత్వం ధరల పెరుగుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కింగ్ అబ్దుల్లా తెలిపారు. కోటి జనాభా గత జోర్డాన్‌లో వనరుల కొరత, పేదరికం, నిరుద్యోగంతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ జనాభాలో 19 శాతం నిరుద్యోగులు, 20శాతం పేదరికంలో మగ్గుతున్నట్లు ఆ దేశ గణాంకాలు చెప్తున్నాయి. 2016లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి తీసుకున్న 723 మిలియన్లు రుణాన్ని చెల్లించి భవిషత్తుల్లో మరిన్ని రుణాలు పొందే విధంగా ఆర్థిక సంస్కరణ చేపట్టింది. దానిలో రాయితీలు తగ్గించి ట్యాక్స్‌లు పెంచాలని ప్రభుత్వం భావించింది. ఒక్కసారిగా ఇంధనంపై 5.5 శాతం, విద్యుత్‌పై 19 శాతం ధరలు పెంచడంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైయాయి. -
ఖురాన్, కంప్యూటర్ పట్టుకోండి
న్యూఢిల్లీ: ఉగ్రవాదం, తీవ్రవాదంపై చర్యలు ఏ మతానికో వ్యతిరేకంగా చేస్తున్నవి కాదని, అమాయకులపై అకృత్యాలకు పాల్పడేలా యువతను రెచ్చగొడుతున్న ఆలోచనా విధానాన్ని తిప్పికొట్టేందుకేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముస్లిం యువత ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కంప్యూటర్ పట్టుకున్నప్పుడే పూర్తిస్థాయి సంక్షేమం, సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ‘ఇస్లామిక్ సంస్కృతి: అవగాహన పెంపొందించుట, సంయమనం’ అంశంపై నిర్వహించిన సదస్సులో జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్‌తో కలిసి మోదీ ప్రసంగించారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడేవారు.. ఏ మతం కోసమైతే పనిచేస్తున్నారో దానికి నష్టం కలిగిస్తున్నారన్న విషయం గ్రహించడం లేదని ప్రధాని చెప్పారు. తీవ్రవాదానికి చెక్ పెట్టేందుకు జోర్డాన్‌లో రాజు అబ్దుల్లా చేపట్టిన చర్యల్ని మోదీ ప్రశంసిస్తూ.. తీవ్రవాదుల అరాచకాల్ని అరికట్టేందుకు ఆ విధానాలు ప్రయోజనకరంగా నిలుస్తాయన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలను సంరక్షిస్తున్న దేశం భారత్ అని, దేశంలోని ప్రాచీన బహుళత్వపు విలువలకు అనుసరణీయ మార్గమే ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థని ఆయన పేర్కొన్నారు. అన్ని మతాలు మానవతా విలువల్నే చాటిచెపుతున్నాయని, ఇస్లాంలోని మానవతా విలువలతో యువత అనుసంధానం కావాలని ఆకాంక్షించారు. మత విశ్వాసం, మానవత్వం కలిసికట్టుగా సాగాలి: అబ్దుల్లా జోర్డాన్ రాజు అబ్దుల్లా ప్రసంగిస్తూ.. అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై కొనసాగుతున్న యుద్ధం రెండు మతాల మధ్య పోరుగా భావించకూడదన్నారు. అన్ని మత విశ్వాసాలు, సమాజాలకు చెందిన మితవాదులకు.. విద్వేషం, హింసను ప్రేరేపిస్తున్న అతివాదులకు మధ్య పోరుగా ఆయన అభివర్ణించారు. మతం పట్ల తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. మత విశ్వాసం, మానవత్వం కలిసికట్టుగా ముందుకు సాగాలని అభిలషించారు. ‘ఇస్లాం, లేదా ఏ మత ప్రచారంలోనైనా తప్పుడు ప్రచారం చేసే గ్రూపుల్ని గుర్తించి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరముంది. విద్వేషాన్ని ప్రచారం చేసేవారికి సమాచార వ్యవస్థ, ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చేయాలి’ అని అన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్లా సోదరుడు ప్రిన్స్ ఘాజీ బిన్ ముహమ్మద్ తలాల్ రచించిన ‘ఏ థింకింగ్ పర్సన్స్ గైడ్ టు ఇస్లాం’ అనే పుస్తకం ఉర్దూ కాపీని జోర్డాన్ రాజుకు ప్రధాని నరేంద్ర మోదీ బహూకరించారు. జోర్డాన్ రాజుతో మోదీ చర్చలు పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై జోర్డాన్ రాజుతో మోదీ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరు సహా 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ చర్చల వివరాలు వెల్లడిస్తూ.. ‘ఎప్పటినుంచో కొనసాగుతున్న సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలకు ఈ చర్చలు కొత్త ఊపునిచ్చాయి’ అని చెప్పారు. వైద్యం, మెడిసిన్, రాక్ ఫాస్పేట్, ఎరువుల దీర్ఘకాలిక సరఫరా, కస్టమ్స్ అంశంలో పరస్పర సహకారం తదితర ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. -
'ఈ యుద్ధం ముస్లింలపై కాదు.. '
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై ప్రపంచం చేస్తున్న పోరాటం హింసపై, ద్వేషంపై చేస్తున్న పోరాటం మాత్రమే తప్ప ఏ ఒక్క మతంపైనో లేక ముస్లిం వర్గంపైనో కాదని జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 అన్నారు. మహ్మద్ ప్రవక్త ప్రపంచమంతా మానవత్వం, దయ, జాలివంటివి వెల్లి విరియాలని ప్రచారం చేశారే తప్ప హింసకు పాల్పడాలని ఎక్కడా చెప్పలేదని అన్నారు. 'ఇది నా విశ్వాసం.. ఈ విశ్వాసం నేను నా బిడ్డలకు చెబుతాను. ఇదే విశ్వాసాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1.8బిలియన్ల ముస్లింలు పంచుకోండి' అని అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ వారసత్వం : అవగాహన, ఆధునికత అనే అంశంపై ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఓ పక్క భారత్, జోర్డాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగ్రవాదం, జాతి విధ్వేషంపై పోరాటానికి శంఖం పూరించిన సందర్భంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'ఉగ్రవాదంపై పోరాటం ఏ మతంపైనా కాదు.. అంతకంటే ముస్లింలపైనా కాదు.. విద్వేషం, హింసవంటి అంశాలపైనే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఈ విషయాన్ని అందరూ అర్ధం చేసుకోవాలి. కొన్ని వర్గాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి' అని అబ్దుల్లా అన్నారు. -
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
భారత్ - జోర్డాన్ అంగీకారం కింగ్ అబ్దుల్లాతో ప్రణబ్ భేటీ అమ్మాన్: ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, జోర్డాన్లు నిర్ణయించాయి. జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల్లో ఆరు రోజుల పర్యటనకు బయలుదేరిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం తొలుత జోర్డాన్ రాజధాని అమ్మాన్ చేరుకున్నారు. ఆ దేశ పాలకుడు కింగ్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. ఉగ్రవాదం, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సంస్కరణలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై పోరాటం, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య మరింత ఎక్కువగా సహకారం అవసరమని అగ్రనేతలిద్దరూ అంగీకారానికి వచ్చారు. జోర్డాన్‌కు భారత్ రూ. 650 కోట్ల మేర రుణం ఇవ్వనున్నట్లు కింగ్ అబ్దుల్లాకు ప్రణబ్ తెలిపారు. ఇరు దేశా భాగస్వామ్యంతో రూ. 5,570 కోట్ల వ్యయంతో ఇషీదియాలో నిర్మించిన ప్రపంచంలో అతి భారీ సల్ఫ్యూరిక్ యాసిడ్ (గంధకికామ్లము) పరిశ్రమను ప్రణబ్, అబ్దుల్లాలు అమ్మాన్‌లోని రాజసౌధం హల్ హుస్సేనియా నుంచే ఆన్లైన్లో రిమోట్ బటన్ ద్వారా ప్రారంభించారు. అంతకుముందు అమ్మాన్ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌కు కింగ్ అబ్దుల్లా మధ్యాహ్న విందు ఇచ్చారు. క్వీన్ రానియాతో సహా సాధ్యమైనంత త్వరలో భారత పర్యటనకు రావాలన్న ప్రణబ్ ఆహ్వానాన్ని అబ్దుల్లా అంగీకరించారు.