జోర్డాన్ రాజుకు ఉర్దూ పుస్తకాన్ని కానుకగా ఇస్తున్న మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదం, తీవ్రవాదంపై చర్యలు ఏ మతానికో వ్యతిరేకంగా చేస్తున్నవి కాదని, అమాయకులపై అకృత్యాలకు పాల్పడేలా యువతను రెచ్చగొడుతున్న ఆలోచనా విధానాన్ని తిప్పికొట్టేందుకేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముస్లిం యువత ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కంప్యూటర్ పట్టుకున్నప్పుడే పూర్తిస్థాయి సంక్షేమం, సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ‘ఇస్లామిక్ సంస్కృతి: అవగాహన పెంపొందించుట, సంయమనం’ అంశంపై నిర్వహించిన సదస్సులో జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్‌తో కలిసి మోదీ ప్రసంగించారు.
మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడేవారు.. ఏ మతం కోసమైతే పనిచేస్తున్నారో దానికి నష్టం కలిగిస్తున్నారన్న విషయం గ్రహించడం లేదని ప్రధాని చెప్పారు. తీవ్రవాదానికి చెక్ పెట్టేందుకు జోర్డాన్‌లో రాజు అబ్దుల్లా చేపట్టిన చర్యల్ని మోదీ ప్రశంసిస్తూ.. తీవ్రవాదుల అరాచకాల్ని అరికట్టేందుకు ఆ విధానాలు ప్రయోజనకరంగా నిలుస్తాయన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలను సంరక్షిస్తున్న దేశం భారత్ అని, దేశంలోని ప్రాచీన బహుళత్వపు విలువలకు అనుసరణీయ మార్గమే ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థని ఆయన పేర్కొన్నారు. అన్ని మతాలు మానవతా విలువల్నే చాటిచెపుతున్నాయని, ఇస్లాంలోని మానవతా విలువలతో యువత అనుసంధానం కావాలని ఆకాంక్షించారు.
మత విశ్వాసం, మానవత్వం కలిసికట్టుగా సాగాలి: అబ్దుల్లా
జోర్డాన్ రాజు అబ్దుల్లా ప్రసంగిస్తూ.. అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై కొనసాగుతున్న యుద్ధం రెండు మతాల మధ్య పోరుగా భావించకూడదన్నారు. అన్ని మత విశ్వాసాలు, సమాజాలకు చెందిన మితవాదులకు.. విద్వేషం, హింసను ప్రేరేపిస్తున్న అతివాదులకు మధ్య పోరుగా ఆయన అభివర్ణించారు. మతం పట్ల తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. మత విశ్వాసం, మానవత్వం కలిసికట్టుగా ముందుకు సాగాలని అభిలషించారు. ‘ఇస్లాం, లేదా ఏ మత ప్రచారంలోనైనా తప్పుడు ప్రచారం చేసే గ్రూపుల్ని గుర్తించి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరముంది. విద్వేషాన్ని ప్రచారం చేసేవారికి సమాచార వ్యవస్థ, ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చేయాలి’ అని అన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్లా సోదరుడు ప్రిన్స్ ఘాజీ బిన్ ముహమ్మద్ తలాల్ రచించిన ‘ఏ థింకింగ్ పర్సన్స్ గైడ్ టు ఇస్లాం’ అనే పుస్తకం ఉర్దూ కాపీని జోర్డాన్ రాజుకు ప్రధాని నరేంద్ర మోదీ బహూకరించారు.
జోర్డాన్ రాజుతో మోదీ చర్చలు
పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై జోర్డాన్ రాజుతో మోదీ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరు సహా 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ చర్చల వివరాలు వెల్లడిస్తూ.. ‘ఎప్పటినుంచో కొనసాగుతున్న సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలకు ఈ చర్చలు కొత్త ఊపునిచ్చాయి’ అని చెప్పారు. వైద్యం, మెడిసిన్, రాక్ ఫాస్పేట్, ఎరువుల దీర్ఘకాలిక సరఫరా, కస్టమ్స్ అంశంలో పరస్పర సహకారం తదితర ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది.
Comments
Please login to add a commentAdd a comment