మిస్త్రీ జహూర్ ఇబ్రహీం.. ఈ పేరు వినగానే భారత్ రక్తం మరిగిపోతుంటుంది. ఎందుకంటే కాందహార్ హైజాక్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ IC-814 విమానం దారిమళ్లించిన ముష్కరుల్లో ఒకడు వీడు. అంతేకాదు ఒక ప్రాణాన్ని సైతం బలిగొన్నాడు. భారత్‌కు పీడకలగా మిగిల్చిన ఈ హైజాకింగ్‌లో పాల్గొన్న మిస్త్రీ ఇప్పుడు హతమయ్యాడు.
నాడు హైజాక్ కు పాల్పడిన ముష్కరుల్లో మిస్త్రీని ఎవరో హత్య చేశారు. కరాచీ అక్తర్ కాలనీలో నివసిస్తున్న మిస్త్రీ తలలో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో రెండు తుటాలు కాల్చారు గుర్తు తెలియని వ్యక్తులు. మార్చి 1వ తేదీనే ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు జహూర్ అంత్యక్రియలు కరాచీలోనే నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి జైషే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహార్ సోదరుడు, జైషే కీలకనేత అబ్దుల్ రౌఫ్ అస్ఘర్ హాజరయినట్లు సమాచారం.
ఇన్నాళ్లూ తెలియలేదా?
మిస్త్రీ మరణంపై అధికారిక ప్రకటన చేసిన పాక్ అధికారులు.. అతన్ని ఇంతకాలం గుర్తించకపోవడం విశేషం. జాహిద్ అఖుంద్‌గా పేరు మార్చుకుని అక్తర్ కాలనీలోనే ఏళ్లుగా ఉంటున్నాడు. పైగా కరాచీలోనే ఓ పెద్ద ఫర్నీచర్ షాప్ నిర్వహిస్తున్నాడు కూడా. అయినప్పటికీ పాక్ అధికారులు అతన్ని ట్రేస్ చేయకపోవడం విచిత్రం. కరాచీ నగరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో కాల్పుల దృశ్యాలు రికార్డయ్యాయి.
హైజాక్ ఇలా..
1999 డిసెంబర్ 24న సుమారు 180 మంది ప్యాసింజర్లు, 11 మంది బృందంతో వెళ్తున్న IC-814 విమానాన్ని .. ఐదుగురు ఉగ్రవాదులు దారి మళ్లించి హైజాక్ చేశారు. అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్ కు చేరుకుంది. అక్కడ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. 25 ఏళ్ల ప్రయాణికుడు రూపిన్ కట్యాల్‌ను పొట్టనబెట్టుకున్నారు హైజాకర్లు. చివరికి డిసెంబర్ 31న.. కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ విడుదల చేయడంతో.. మిగతా ప్రయాణికులను అప్పగించారు. రూపిన్‌ను చంపింది మిస్త్రీనే అని అధికారులు సైతం ధృవీకరించారు అప్పట్లో.
భార్యతో రూపిన్ కట్యాల్
ఇక కాందహార్ హైజాక్ ఘటన తర్వాత జహూర్ మిస్త్రీ... జాహిద్ అఖుంద్ పేరుతో పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో స్థిరపడి ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అతడి హత్యను నిర్ధారించిన జియో టీవీ... ఓ వ్యాపారవేత్త హత్య అంటూ కథనం ప్రసారం చేయడం కొసమెరుపు. ఇదిలా ఉండగా.. మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను ఎవరు లేపేసారన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment